కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనాను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. అన్ని విద్యాసంస్థలు, షాపులతో పాటు వైన్స్‌ షాపులు సైతం మూసివేశారు. దీంతో మందుబాబులకు ఎక్కడలేని కష్టాలు వచ్చిపడ్డాయి. మద్యం లేక వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈనెల 22వ తేదీ నుంచి మద్యం దొరక్కపోవడంతో మద్యం ప్రియులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మద్యం బ్లాక్‌లో దొరుకుతుందేమోనని సందుగొంతులు వెతుకుతున్నారు. కాస్త ఎక్కువ రేటైనా తీసుకుందామంటే దొరకని పరిస్థితి నెలకొంది. ‘కేసీఆర్‌ సార్‌ వైన్స్‌ షాపులు తెరిపించండి’ అంటూ వేడుకుంటున్నారు. రోజుకు కొన్ని గంటలైనా సరే మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలని ఎవరికి తోచిన విధంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మార్చి 29 తేదీ అంటే ఆదివారం రోజు వైన్స్‌ షాపులు తెరుస్తారంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు తెరిచి ఉంటాయని, అలాగే ప్రతి వైన్స్‌ షాపు వద్ద ఒక ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉండి పరిస్థితిని సమీక్షించాలి. మద్యం షాపునకు వచ్చే వ్యక్తుల మధ్యం దూరం ఉండేలా చూడాలి.. అని సారాంశం ఉన్న ఓ జీవో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక జీవో చూసిన మద్యం ప్రియులు షేర్లు చేసుకుంటూ ఆదివారం నుంచి మద్యం షాపులు తెరుస్తారంటూ తెగ సంబరపడి మద్యం షాపుల వద్ద గుమిగూడారు. మద్యం సేవించకుంటే తోచడం లేదని, కాళ్లు, చేతులు వణుకుతున్నాయంటూ మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదివారం మద్యం షాపులు తెరుస్తారని నమ్మిన మందుబాబులు నగరంలోని వైన్స్‌ షాపుల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. ఎప్పుడు వచ్చి షాపు తెరుస్తారో.. ఎప్పుడెప్పుడు మద్యం తీసుకుని తాగుదమోనన్నట్లు ఎదురు చూపులు చూడడం మొదలు పెట్టారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.