Fact Check : భారత్ బయోటెక్ వైస్ ప్రెసిడెంట్ తన మీదే కరోనా వ్యాక్సిన్ ను ప్రయోగించాలని కోరారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2020 5:40 PM IST
Fact Check : భారత్ బయోటెక్ వైస్ ప్రెసిడెంట్ తన మీదే కరోనా వ్యాక్సిన్ ను ప్రయోగించాలని కోరారా..?

కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి వ్యాక్సిన్ ను ఎప్పుడు తయారు చేస్తారా అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. హైదరాబాద్ కు చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ సంస్థ కూడా వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో మనుషులపై ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి దక్కించుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ఈ వ్యాక్సిన్ ఆగస్టు 15 లోగా అందుబాటులోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.

మనుషులపై ట్రయల్స్ చేయాలని భారత్ బయోటెక్ సంస్థకు అనుమతులు లభించగా.. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.కె.శ్రీనివాస్ తన మీదే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ను నిర్వహించడానికి సిద్ధపడ్డారంటూ ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

“Dr V. K. Srinivas, vice president, Bharat Biotech, taking Corona vaccine…clinical trial. After taking the first dose, he said he is the first person in India to take a vaccine developed by him and his team in Bharat Biotech. Look at the confidence that they have in their product. (sic)”

భారత్ బయోటెక్ సంస్థ తయారుచేయబోయే వ్యాక్సిన్ పట్ల ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నాడని.. అందుకే మొదటి వ్యాక్సిన్ ను తనకే వేయమని కోరుతున్నాడని పలు పోస్టులు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు.

K1

వాట్సప్ లో కూడా ఈ పోస్టును వైరల్ చేశారు.

నిజ నిర్ధారణ:

భారత్ బయోటెక్ వైస్ ప్రెసిడెంట్ తన మీదే కరోనా వ్యాక్సిన్ ను ప్రయోగించాలని కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులన్నీ అబద్ధమని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. తమ ట్విట్టర్ ఖాతాలో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటో అబద్ధమని తెలిపింది.

వాట్సప్, సామాజిక మాధ్యమాల్లో భారత్ బయోటెక్ పేరు మీద వైరల్ అవుతున్న ఫోటోలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ప్రొడక్షన్ స్టాఫ్ మీద రొటీన్ బ్లడ్ టెస్ట్ చేస్తున్న ఫోటోను కొందరు వైరల్ చేశారని స్పష్టం చేసింది.

వ్యాక్సిన్ ను ప్రస్తుతం 12 ఇన్స్టిట్యూట్ లకు పంపామని, కోవ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగించేది అక్కడేనని తెలిపారు. జులై 1 నాడు భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ ఇంకొన్ని క్లియరెన్స్ వస్తే కానీ మనుషుల మీద ట్రయల్స్ నిర్వహించడం కుదరదని తెలిపారు. అందుకు ఇంకా 10 రోజుల సమయం పడుతుందని తెలిపారు.

డాక్టర్ వి.కె.శ్రీనివాస్ మొదటి కోవిద్-19 వ్యాక్సిన్ ను వేయించుకున్నారన్నది పచ్చి అబద్ధం. సాధారణంగా చేసే రక్త పరీక్షల సమయంలో తీసిన ఫోటో మాత్రమే..!

Next Story