భట్టి విక్రమార్క VS మంత్రి తలసాని : రెండో రోజు ఏమయ్యిందంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Sept 2020 7:05 PM ISTఅసెంబ్లీ వేదికగా డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మధ్య వాడివేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరూ నేతలు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు, హైదరాబాద్ అభివృద్ధిని చూపాలని మంత్రికి.. భట్టి సవాల్ విసిరారు. ఇందుకు స్పందించిన మంత్రి తలసాని.. భట్టి విక్రమార్కని తీసుకెళ్లి చూపిస్తానన్నారు.
ఈ క్రమంలోనే సీఎల్పీ నేత భట్టీ సవాల్ స్వీకరించిన మంత్రి గురువారం ఉదయం ఆయన ఇంటికి చేరుకుని 3428 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇక శుక్రవారం నాడు మరికొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తామని నిన్న ఇరువురు నేతలు చెప్పిన మాట తెలిసిందే. అయితే.. ఈ రోజు ‘డబుల్’ ఇళ్ల పరిశీలనలో భాగంగా తుక్కుగూడలోని మంకల్‌లో పర్యటించారు.
అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు చూపిస్తామని.. 3428 ఇళ్లు మాత్రమే చూపించారని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కట్టిన ఇళ్లను మాత్రమే చూపించాలని.. గ్రేటర్ బయట కట్టిన ఇళ్లను కూడా చూపిస్తే ఎలా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని.. లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు చూపిస్తామని చెప్పి మంత్రి, నగర మేయర్ పారిపోయారని ఎద్దేవా చేశారు.
మరోవైపు లక్ష ఇళ్ల జాబితా ఇస్తాం.. మీరే చూసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. నగర శివారులో కట్టిన ఇళ్లు కూడా నగర వాసుల కోసమేనని మంత్రి తెలిపారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేసిందని.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లనే కాదు.. హైదరాబాద్‌లో అభివృద్ధిని కూడా చూపిస్తామని మంత్రి అన్నారు. అభివృద్ధిని చూపించే దమ్ము, ధైర్యం తమకున్నాయని మంత్రి పేర్కొన్నారు.