10 రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే.. ఆదేశించిన కేంద్రం
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2020 6:27 AM GMTభారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకు దేశంలో 2,66,598 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,446 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. గతవారం రోజులుగా ప్రతి రోజు 9వేలకు పైగా కేసులు నమోదు అవుతుండగా.. 200 పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే.. అన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం లేదు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లోనే కరోనా ఉదృత్తి కొనసాగుతుతోంది. దీంతో ఆయా ప్రాంతాలపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటింటి సర్వే చేపట్టడం, వెంటనే పరీక్షలు నిర్వహించడం, వైరస్ వ్యాప్తి, మరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 38 జిల్లాల్లో ఉన్నట్టు గుర్తించింది.
మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాలని, వైరస్ సంక్రమణం అరికట్టేలా పటిష్టమైన నిఘా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, ఇతర ఉన్నతాధికారులు సమావేశమై ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటిండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో మాట్లాడారు.
లాక్‌డౌన్ నిబంధలన్నీ పూర్తిగా సడలించడంతో రాబోయే నెల్లో జిల్లాల వారిగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జనసాంద్రత అధికంగా ఉండే పట్టణాల్లో వైరస్ వ్యాప్తి, ఇంటింటి సర్వేలు, పరీక్షలు, వైరస్ కట్టడికి అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించారు. మున్సిపల్, స్థానిక అధికారులు వైరస్ కట్టడి చేసేందుకు బాధ్యతలు తీసుకోవాలని, సర్వే బృందాలు, అంబులెన్స్‌ల నిర్వహణ, ఆస్పత్రుల్లో పడకల నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపింది.