డాక్టర్ల జీతాలే కాదు.. నర్సుల జీతాలు సైతం అంతలా పెరిగాయట

By సుభాష్  Published on  12 July 2020 6:39 AM GMT
డాక్టర్ల జీతాలే కాదు.. నర్సుల జీతాలు సైతం అంతలా పెరిగాయట

కరోనా కాలంలో అన్ని రంగాల వారికి ఊహించని రీతిలో దెబ్బ పడుతోంది. ఇది.. అది అన్న తేడా లేకుండా ప్రతి రంగానికి కరోనా విసిరిన సవాలుకు అతలాకుతలమైపోతున్నాయి. దీంతో.. ఊహించని రీతిలో లేఆఫ్ లు మాత్రమే కాదు.. జీతాల్లోనూ కోత విధిస్తున్నారు. ఇలాంటివేళ.. మిగిలిన రంగాలకు భిన్నంగా వైద్య రంగంలో పని చేసే వారికి విపరీతమైన డిమాండ్ నెలకొన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ వైరస్ వచ్చిన మొదట్లో పలు కార్పొరేట్ ఆసుపత్రులు పెద్దగా పని చేయలేదు. ఆ సమయంలో పలువురు వైద్యుల జీతాల్లో కోత విధించటం జరిగింది.

ఎప్పుడైతే.. ప్రైవేటు ఆసుపత్రులకు వైద్యం చేసే అవకాశం ఇచ్చారో.. అప్పటి నుంచి పరిస్థితుల్లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో.. వైరస్ ముప్పు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పెద్ద వయస్కులైన పలువురు వైద్యులు పని చేయకుండా దూరంగా ఉండిపోతున్నారు. పెద్ద వయసులో వైరస్ ఎటాక్ ఎక్కువగా ఉండటం.. త్వరగా దాని బారిన పడే ముప్పు పొంచి ఉండటంతో.. తమ ఉద్యోగాలకు దూరంగా ఉండిపోతున్నారు.

అదే సమయంలో పెరిగిపోతున్న పాజిటివ్ కేసులతో వైద్యులు.. వైద్య సిబ్బంది కొరత అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ డిమాండ్ ను అధిగమించేందుకు వీలుగా ప్రైవేటు..కార్పొరేట్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు కార్పొరేట్ ఆసుపత్రులు ఇటీవల కేరళ నుంచి ప్రత్యేకంగా విమానాల్లో నర్సింగ్ సిబ్బందిని తెప్పించటం ఇందుకు ఉదాహరణగా చెప్పాలి. విడి రోజుల్లో నెలకు రూ.20వేల లోపు మాత్రమే ఉండే జీతాలు ఇప్పుడు నెలకు రూ.50 నుంచి రూ.60వేలకు పెరిగిపోయాయి. అన్నింటికి మించి ఐసీయూలో పని చేసిన అనుభవం ఉన్న నర్సింగ్ సిబ్బంది కొరత పెరిగింది. వీరికి ఇప్పటివరకు ఇస్తున్న జీతానికి డబుల్ ఇచ్చేందుకు ఆసుపత్రులు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

నర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే.. వైద్యులు.. స్పెషలిస్టులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. కోవిడ్ ముందు వరకు ఎంబీబీఎస్ వైద్యుడికి కార్పొరేట్ ఆసుపత్రిలో రూ.25వేలతో స్టార్ట్ చేసేవారు. అనంతరం వారి పని తీరు ఆధారంగా ప్యాకేజీ ఇస్తుంటారు. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు వారి జీతాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. అన్నింటికి మించి జనరల్ ఫిజిషియన్ల డిమాండ్ బాగా పెరిగింది. గతంలో నెలకురూ.2లక్షల జీతాన్ని ఇచ్చిన వైద్యుడికి ఇప్పుడు ఏకంగా నెలకు రూ.6లక్షలు ఇచ్చేందుకు ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నా.. నిపుణులు దొరకని పరిస్థితి నెలకొంది.

ఐసీయూలో పని చేసే ఇంటెన్సివిస్టులకు గతంలో రూ.3లక్షల ప్యాకేజీ ఉంటే.. ఇప్పుడది ఏకంగా రూ.8లక్షలకు చేరుకుంది. ఊపిరితిత్తుల సమస్యలు చూసే పల్మానాలజిస్టులకు డిమాండ్ ఎక్కువైంది. గతంలో ఒక రోగిని పల్మనాలజిస్టులు రూ.వెయ్యి ఛార్జ్ చేస్తే ఇప్పుడది రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు పెరగటం గమనార్హం. గతంలో ఎంబీబీఎస్ వైద్యులకు ఇచ్చే జీతాలకు రెండు.. మూడు రెట్లు ఇచ్చేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. వైద్యులు.. వైద్య సిబ్బంది మాత్రమే కాదు.. హౌస్ కీపింగ్ సిబ్బందికి వైరస్ ముప్పు పెరగటంతో వారి జీతాల్ని రెండు.. మూడు రెట్లు పెంచేశాయి. ఈ భారం మొత్తం అంతిమంగా పేషెంట్ల మీద పడుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు ఎంత ఇచ్చినా.. నిపుణుల కొరత చాలా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

Next Story