హైదరాబాద్ గాంధీలో రోబో.. ఏం చేయనుందంటే?

By సుభాష్  Published on  12 July 2020 6:17 AM GMT
హైదరాబాద్ గాంధీలో రోబో.. ఏం చేయనుందంటే?

కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించేందుకు వీలుగా గాంధీ ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయటం తెలిసిందే. తొలుత వెయ్యి పడకలతో మొదలైన ఈ ఆసుపత్రి ప్రస్తుతం 1800లకు పైగా పడకలతో రోగులకు సేవల్ని అందిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోవిడ్ ఆసుపత్రులతో పోల్చినప్పుడు గాంధీ పనితీరు మిశ్రమంగా ఉందని చెప్పాలి. మందు లేని జబ్బుకు వైద్యం చేయటం సవాలుతో కూడుకున్నది. ఈ విషయంలో గాంధీ వైద్యులు విజయం సాధించారనే చెప్పాలి.

క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో పాటు.. కోవిడ్ తో వచ్చిన చాలామందికి స్వస్థత చేకూర్చారు. ప్రభుత్వం మరిన్ని మౌలిక సదుపాయాల్ని కల్పించాలే కానీ గాంధీ వైద్యులు మరిన్ని అద్భుతాలు చేసే అవకాశం ఉందన్న వాదన కూడా ఉంది. మిగిలిన ఆసుపత్రులతో పోలిస్తే.. కోవిడ్ పేషెంట్లకు వైద్యం చేస్తూ.. దాని బారిన పడే విషయంలో గాంధీ వైద్యులు.. వైద్య సిబ్బంది ట్రాక్ రికార్డు బాగుందనే చెప్పాలి.

తాజాగా గాంధీ అమ్ములపొదిలో ఒక రోబో వచ్చి చేరింది. ప్రమాదరకరమైన వైరస్ ఉన్న పేషెంట్లకు వైద్యం చేయటం కత్తి మీద సామే. ఇలాంటి సమయంలో గాంధీకి అందుబాటులోకి వచ్చిన రోబోతో వైద్య సిబ్బంది మీద ఒత్తిడి తగ్గుతుందనే చెప్పాలి. దాదాపు రూ.12లక్షల విలువైన రోబోను రీవాక్స్ ప్రతినిధులు గాంధీ ఆసుపత్రికి వితరణగా ఇచ్చారు.

ఈ రోబో సాయంతో ఎలాంటి రసాయనాల అవసరం లేకుండానే డిస్ ఇన్ ఫెక్ట్ చేసే సదుపాయం ఉంది. ఐసీయూ పడకలున్న ప్రాంతాన్ని కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో డిస్ ఇన్ ఫెక్షన్ చేయటంలో కీలకభూమిక పోషించనుంది. ఈ తరహా రోబోలను పెద్ద ఎత్తున గాంధీకి సమకూరిస్తే.. పేషెంట్లతో పాటు.. వారికి వైద్యం చేసే వైద్యులకు కూడా మరింత రక్షణగా మారుతుందని చెప్పాలి. ఇలాంటి హైటెక్ వసతుల్ని కల్పించే విషయం మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Next Story