'కరోనా'పై తప్పుడు ప్రచారం.. గాంధీ ఆస్పత్రి వైద్యుడి ఆత్మహత్యాయత్నం

By అంజి  Published on  11 Feb 2020 2:52 PM IST
కరోనాపై తప్పుడు ప్రచారం.. గాంధీ ఆస్పత్రి వైద్యుడి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ వసంత్‌కుమార్‌ ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రికి వచ్చిన వసంత్‌.. పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నిచాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నం చేశారు. దీంతో గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని వసతులు సరిగా లేవని తాను ప్రశ్నించడం వల్లే వేటు వేశారని ఆయన పేర్కొన్నారు. చేయని తప్పుకు తాను శిక్ష అనుభవించనని.. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైద్యుడి ఆత్మహత్యాయత్నంతో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చాడన్న ఆరోపణతో అతడిపై అధికారులు వేటు వేశారు. ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగంలో పని చేస్తున్న వసంత్‌ కుమార్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు సరెండర్‌ చేస్తూ వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రోజుల కిందట గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఓ ప్రకటన సంచలనం రేపింది. అయితే ఇది అవాస్తమని తేలడంతో.. డాక్టర్‌ వసంత్‌కుమారే దీనికి కారణమని గుర్తించి సరెండర్‌ చేశారు. కరోనా ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు గాంధీ ఆస్పత్రిలో తగిన పరిస్థితులు లేవని ఢిల్లీ నుంచి వచ్చిన బృందానికి వసంత్‌ కుమార్‌ తప్పుడు సమాచారం ఇచ్చారని వైద్యాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వసంత్‌కుమార్‌కు సహకరించిన మరో డాక్టర్‌కు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్ కుమార్‌ షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.

Next Story