ఆ స్ఫూర్తితోనే ఇప్పటి వరకూ 3 లక్షల మందికి ఉచిత వైద్యం చేశాను..
By అంజి Published on 6 Feb 2020 8:12 AM GMTఆయుర్వేదం.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వైద్యా విధానాలు ఉన్నప్పటికి.. భారతదేశానికి చెందిన ఆయుర్వేదానికి ఉన్న విశిష్టత, ప్రత్యేకతో ఎంతో. ఆయుర్వేదంలో ఎన్నో జబ్బులకు చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఆయుర్వేదం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని, ప్రజా వైద్యుడిగా మన్నలు అందుకుంటున్న ప్రముఖ ఆయుర్వేద డాక్టర్. పాములపర్తి రామారావు.
ఆయుర్వేదం గురించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
నా పేరు పాములపర్తి రామారావు. వరంగల్ వాస్తవ్యుడిని. ఆయుర్వేదం అనేది మన భారతీయ దేశీయ వైద్యం. ఆయుర్వేదం గత 2500 సంవత్సరాల నుంచి మన భారతీయ జనజీవన విధానంలో కలిసిపోయి ఉన్న వైద్యశాస్త్రం. ఈ వైద్యశాస్త్రం గురించి చదువుకొమని ప్రముఖులు, మేధావి, జర్నలిస్ట్ అయిన మా నాన్నా పాములపర్తి సదాశివరావు ప్రోత్సహించారు. వరంగల్‌లోని అనంత లక్ష్మీ ఆయుర్వేద ప్రభుత్వ కళాశాలలో నేను ఆయుర్వేద డిగ్రీ విద్యను అభ్యసించాను. ఆ తర్వాత కేరళలోని త్రివేండ్రంలోని ఆయుర్వేద కళాశాలో ఎండీ పట్టా పొందాను. తదనంతరం భద్రాచలంలోని చర్ల అనే మండలంలో ఏడు సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానం వదిలిపెట్టి 1993లో నేను చదువుకున్న కళాశాలలోనే లెక్చరర్‌గా చేశాను. క్రమక్రమంగా పదోన్నతులు పొందుతూ 2006లో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలకు ఫ్రొఫెసర్‌గా వచ్చాను. రెండు సంవత్సరాలు పాటు ఇక్కడి ప్రజలకు కూడా సేవలు అందించాను. 2016లో నేను చదువుకున్న కళాశాలలో ఫ్రొఫెసర్‌గా రిటైర్మెంట్ అయ్యాను.
ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదం చక్కని పరిష్కారం. 100 శాతం రోగాల్లో.. 30 శాతం రోగాలకు అత్యాధునిక, ఇంగ్లీష్ వైద్యం అవసరం అనివ్యార్యం కూడా.. కానీ మిగిలిన 70 శాతం రోగాలకు ఇంగ్లీష్ వైద్యం, హోమియోపతి వైద్యం కన్నా ఆయుర్వేద వైద్యం అత్యుత్తమైనది.
మీరూ ఉచితంగా వైద్యం అందిస్తుంటారు కదా.. అది ఎలా సాధ్యం..?
విద్య, వైద్య వృత్తులు అనేవి అతి పవిత్రమైన వృత్తులు. ఈ వృత్తులను ఎవరైనా ఉచితంగానే ఇతరులకు అందించాలి. నేను ఒక వైద్యుడిని అందుకే ఉచిత వైద్యం చేస్తున్నాను. నా తండ్రి నాకు రోల్ మోడల్. బాధతో వైద్యం కోసం నా దగ్గరకు వచ్చిన వారి దగ్గర డబ్బులు ఆశించడం తప్పు అని మా నాన్నా చెప్పారు. నీకు వచ్చిన వైద్యం చేసి ఆ వ్యక్తి బాధను తగ్గించు.. ఆతర్వాత సంతోషంతో ఏదైనా ఇస్తే, తిరస్కరించకుండా తీసుకోమ్మని మా నాన్నా చెప్పారు. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా వస్తోంది.. ప్రజల నుంచి నేను డబ్బులు ఆశించాలనుకోవడం లేదు. ఇక ముందు కూడా ఉచిత వైద్యాన్ని ఇలానే కొనసాగిస్తాను. వైద్యం పవిత్ర వృత్తి.. దానిని వ్యాపారం చేయకూడదనేదే నా మోటో.
మీ ఆస్పత్రి ఎక్కడ ఉంది.. మీరు ఎక్కడి నుంచి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తారు?
వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న కాలనీలోని మా ఇల్లు ఉంటుంది. ఇంటినే ఆస్పత్రిగా మార్చాను. మొదట్లో 30 నుంచి 40 మంది పెషెంట్లు వచ్చేవారు. క్రమక్రమంగా పెషెంట్ల సంఖ్య రోజుకు 2 వేల వరకు పెరిగింది. నేను ముఖ్యంగా దీర్ఘకాలిక జబ్బులు, ఆయాసం, దమ్ము, అలర్జీ, జాండిస్‌తో పాటు ముఖ్యంగా డిస్క్ సమస్యకు వైద్యం చేస్తాను. ఇప్పటి వరకు డిస్క్ సమస్యలతో బాధపడుతున్న 3 లక్షల మందికి శాశ్వతంగా విముక్తి కల్పించాను. నేను ఇప్పటికి ఒకటే కోరుకుంటున్నాను.. రోజు 200 మంది నుంచి 300 మంది వరంగల్‌లోని నా ఆస్పత్రికి రండి. లక్షల రూపాయల ఖర్చుకాకుండా ఉచితంగా వైద్యం చేస్తాను. అనవసరపు ఆపరేషన్లకు పోకుండా చేస్తాను. మోకాళ్ల నొప్పులకు అద్భుతమైన ఆయుర్వేద మందులున్నాయి. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్ బాచుపల్లిలోని నా కూతురి ఇంట్లో వైద్య సేవలు అందిస్తాను. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియోపై క్లిక్ చేయండి.