తన కల నిజమైనట్లయింది - ‘ఫ్రోజెన్‌ 2’ ట్రైలర్ వేడుక‌లో న‌మ్ర‌త‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 4:53 PM IST
తన కల నిజమైనట్లయింది - ‘ఫ్రోజెన్‌ 2’ ట్రైలర్ వేడుక‌లో న‌మ్ర‌త‌

వాల్ట్‌ డిస్నీ నుంచి వచ్చిన యానిమేటెడ్‌ చిత్రం ‘ఫ్రోజెన్‌’కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. 2013లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద 1.3 బిలియన్‌ డాలర్ల రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది. ఆ ఏడాది ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రంగా ఆస్కార్‌ పురస్కారాన్ని గెలుచుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘ఫ్రోజెన్‌ 2’ని తీసుకొచ్చింది డిస్నీ సంస్థ. ఇందులో ప్రధాన పాత్రలైన యువరాణి ఎల్సాకు ప్రముఖ నటి నిత్యామీనన్‌ డబ్బింగ్‌ చెప్పగా.. చిన్నారి ఎల్సా పాత్రకు మహేష్‌బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గాత్ర దానం చేసింది. హాస్యనటుడు ప్రియదర్శి.. మంచు మనిషి ఓలఫ్‌కు స్వ‌రం అరువిచ్చారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నవంబరు 22న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నటి నిత్య మీనన్‌ మాట్లాడుతూ.. నిజానికి డబ్బింగ్‌ చెప్పడం నాకు ఇష్టం లేదు. యానిమేటెడ్‌ చిత్రాలు పెద్దగా చూడను. కానీ, ఈ చిత్రం కోసం డిస్నీ వాళ్లు నన్ను అడిగినప్పుడు వెంటనే చేస్తానని చెప్పేశా. ఎందుకంటే నాకు ‘ఫ్రోజెన్‌’ చాలా ఇష్టం. అందులోని ఎల్సా నాకు బాగా గుర్తుంది. పిల్లలకి చాలా ఇష్టమైన, బలమైన పాత్ర ఇది. ఓ యానిమేటెడ్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం చాలా కొత్తగా అనిపించింది. ఆంగ్ల భాషలో ఉన్న సంభాషణలను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా లిప్‌ సింక్‌ చేస్తూ చెప్పడాన్ని చాలా ఎంజాయ్‌ చేశానన్నారు.

సితార మాట్లాడుతూ.. చిన్నారి ఎల్సాకు డబ్బింగ్‌ చెప్పడాన్ని చాలా ఎంజాయ్‌ చేశా. ఈ సినిమా చేస్తున్నట్లు నాన్నకు చెప్పినప్పుడు సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యానన్నారు.

నమ్రత మాట్లాడుతూ.. తొలిసారి సితార డబ్బింగ్‌ చెప్తున్నప్పుడు ఓ తల్లిగా ఎంతో సంతోషంగానూ కాస్త భయంగానూ అనిపించింది. ఎల్సాకి సితార చక్కగా డబ్బింగ్‌ చెప్పింది. దీనికోసం తను ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. తన డ్యాన్స్‌ టీచర్‌ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది. సితారకు ఎల్సా పాత్రంటే చాలా ఇష్టం. ఆ పాత్రకు ఇప్పుడు తానే డబ్బింగ్‌ చెప్పడం ద్వారా తన కల నిజమైనట్లయింది. ఇది తనకి అనుకోకుండా దక్కిన అవకాశమన్నారు.

Next Story