రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది: ఎంపీ రేవంత్‌రెడ్డి
By Newsmeter.Network Published on 2 Dec 2019 6:26 PM ISTహైదరాబాద్ దిశ అత్యాచారం, హత్య ఘటనపై తెలుగు రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు. నిందితులను వెంటనే ఉరితీయాలంటూ విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన నిందితులను 30 రోజుల్లోగా బహిరంగంగా ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... హత్య జరిగి నాలుగు రోజులైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ బాధితురాలి కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పరిధిలోకి కాదంటే... తమ పరిధిలోకి రాదని పోలీసులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ ఏరియాలో ఈ ఘటన జరగడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని రేవంత్ దుయ్యబట్టారు. మద్యం వల్ల నేరాలు అధికమవుతున్నాయని ఆరోపించారు. జాతీయ రహదారిలో సైతం టీఆర్ఎస్ నేతలు బార్లు పెట్టారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు... ప్రధాని నరేంద్ర మోదీ చట్టాలను సవరించాలంటూ తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏ సమయంలోనైనా మహిళలు బయటకు వెళ్లాలంటే రక్షణ లేకుండా పోతోందని దుయ్యబట్టారు. నిర్భయ కేసులో నిందితులకు ఇన్నేళ్లయినా..ఇంకా శిక్షపడలేదని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.