ఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. హత్యాచారానికి గురైన పశువైద్యురాలు అసలు పేరు వెల్లడించినందుకు సోషల్‌ మీడియా సంబంధించిన ట్విట్టర్‌ను తప్పు బట్టింది. ఇందుకు క్షమాపణ చెప్పాలని, మరోసారి కూడా ఇలాంటి తప్పులు చేయబోమని నాలుగు వారాల్లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేదంటే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని సదరు ట్విట్టర్‌ సంస్థను హైకోర్టు హెచ్చరించింది. అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి పేరు వెల్లడించిన సోషల్‌ మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకోవాలని యష్‌దీప్‌ చహల్ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డి.ఎన్‌.పటేల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

షాద్‌నగర్‌లో దిశను నలుగురు పాశవికులు ఆటవికంగా అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసి, ఆ తరువాత ఆనవాళ్లు లేకుండా పెట్రోలు పోసి తగులబెట్టారు. దిశ హత్య అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండా నిందితులు ఎదురు తిరగడంతో వారిపై కాల్పులు జరిపారు. నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

దిశ కేసులో న్యాయ విచారణ కమిషన్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. కమిషన్‌లో మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్‌కర్‌, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌లు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన డైరీలను కమిషన్‌ సభ్యులు పరిశీలిస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.