2012, డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ సాగగా, ఇటీవల సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాని దోషుల్లో ఒకరు క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోవడం కారణంగా మళ్లీ వాయిదా పడింది. ఇక దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్త కోర్టును ఆశ్రయించాడు. తన తరపున వాదిస్తున్న లాయర్‌ తొలగించిన కారణంగా తనకు మరింత గడువు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించాడు.

ఈ క్రమంలో నిర్భయ దోషుల్లో పవన్‌ గుప్తా తరపున వాదించేందుకు ఎవరూ లేకపోవడంతో మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ అంశంపై స్పందించిన కోర్టు లాయర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు హాలులోనే ఉన్న నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర భాగోద్వేగానికి గురైంది. శిక్ష అమలును జాప్యం చేసేందుకు దోషులు నటకాలు ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించేలా న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఏడాదిన్నర పాటు అడుగుతున్నానని, అయినా ఏదో విధంగా జాప్యం చేస్తూ శిక్షను వాయిదా వేస్తోందని, ఢిల్లీ హైకోర్టు తీర్పును అనుసరించే వారికి డెత్‌ వారెంట్లు జారీ చేయడం లేదని పేర్కొన్నారు. తాను కూడా కోర్టుకు వచ్చి చేతులు కట్టుకుని తనకు న్యాయం జరగాలని అభ్యర్థిస్తున్నా.. ఫలితం ఉండటం లేదన్నారు. మరి నా హక్కులు ఏమైపోయినట్లు అని జడ్జి ముందు బాధను వెళ్లబోసుకున్నారు.

ఇక నిర్భయ తరపున లాయర్‌ వాదిస్తూ.. సోమవారం వరకు దోషులకు లాయర్‌గా వ్యవహరించిన ఏపీ సింగ్‌ ఏమయ్యారని, ఇప్పుడు పవన్‌ గుప్తా తన లాయర్‌ను తొలగించుకోవడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్నారు. కాగా, ఫిబ్రవరి 1న ఉరి తీసేందుకు ఢిల్లీ పటియాల కోర్టు మరోసారి వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారంరోజుల్లోగా అన్ని అవకాశాలు వినియోగించాలంటూ కోర్టు సూచించగా, లాయర్‌ లేడనే సాకుతో మరోసారి శిక్ష అమలులో జాప్యం నెలకొంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.