దిశ కేసు: సీఎం వైఎస్ జగన్‌కు ఆ దమ్ముందా..!
By అంజి Published on 12 Dec 2019 11:03 AM ISTఅమరావతి: సీఎం వైఎస్ జగన్ హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దిశ హత్య ఘటన నిందితులను న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా.. ఎన్‌కౌంటర్ చేయడాన్ని శాసనసభలో సీఎం జగన్ సమర్థించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హ్యాట్సాప్ చెప్పడాన్ని ఎమ్మార్పీఎస్ పార్టీ ఖండిస్తోందని మందకృష్ణ మాదిగ అన్నారు. తమ సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే సీఎం కేసీఆర్, జగన్‌లు స్పందిస్తారని మందకృష్ణ మాదిగ విమర్శించారు.
నిండు శాసనసభలో దిశను హత్య చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని జగన్ సమర్థించారన్నారు. కాగా న్యాయవ్యవస్థ పరిధిలోకి చొచ్చుకు వచ్చి పోలీసులు నిందితులను హత్య చేశారని మందకృష్ణ ఆరోపించారు. భారత రాజ్యాంగం మీద సీఎం జగన్‌కు ఎంతమాత్రం నమ్మకం లేదని తెలుస్తోందన్నారు. హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్లలో బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నవీన్ రెడ్డిలను కూడా ఎన్‌కౌంటర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సీఎం జగన్ సూచించే సాహసం చేయగలరా అంటూ మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఒక రెడ్డిని చంపిన నలుగురిని ఎన్‌కౌంటర్ చేశారు.. మరీ నలుగురు మహిళలను చంపిన మరో రెడ్డికి ఎందుకు శిక్ష వేయడం లేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రొత్సహంతోనే నిందితులను ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు.
పోలీసులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, దిశ సామాజిక వర్గం నుంచి పెద్దల ఒత్తిడి నేపథ్యంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందన్నారు. వైఎస్సార్ హయాంలో 11 మంది మహిళలపై పోలీసులు అత్యాచారం చేసి హత్యలు చేశారని గుర్తు చేశారు. మరోవైపు ఆయేషామీరా తల్లిదండ్రులు ఇప్పటీకి మానసికంగా కృంగిపోతూనే ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో తల్లికూతుళ్లను దుండగులు దారుణంగా హత్య చేశారన్నారు. తప్పు జరిగిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షించే దమ్ము సీఎం జగన్‌కు ఉందా అంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.