మహిళల రక్షణ కోసం 'దిశ' యాప్..!
By Newsmeter.Network Published on 26 Dec 2019 3:00 PM ISTముఖ్యాంశాలు
- దిశ చట్టం అమలుపై సీఎం జగన్ సమీక్ష
- కోర్టులకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయించాలని సీఎం జగన్ ఆదేశం
- రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు
అమరావతి: దిశ చట్టం అమలు కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హోంమంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితర అధికారులు పాల్గొన్నారు.
దిశ చట్టంపై న్యాయపరంగా, పోలీసు శాఖ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. చట్టం చేశాం, కాని అమలు కావడం లేదన్న ఆట ఎక్కడా రాకూడదు, వినిపించకూడదని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఏకైక అజెండాతో చాలా మంది పని చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేవలం టీడీపీతోనే కాకుండా టీడీపీ అనుకూల మీడియాతో, చంద్రబాబుకు మద్దతిస్తున్న వారితో తాము పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. మద్యం మహమ్మారిని పారద్రోలానే ఉద్దేశంతో తొలిదశ చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. మద్యం నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గించామన్నారు. పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాపులు, బార్ల సంఖ్యను తగ్గించామన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ చర్యలపై కూడా ప్రతిపక్షం అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
దిశ చట్టం పకడ్బందీగా అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. 13 కోర్టులకు అవసరమైన బడ్జెట్‌ను కూడా వెంటనే కేటాయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతి కోర్టుకూ సుమారు రూ.2 కోట్లు అవసరం అవుతాయని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో అవసరమైన డబ్బును వెంటనే డిపాజిట్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్ర పోలీస్ విభాగంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్ విభాగాన్ని రెట్టింపు చేయడానికి, మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి సీఎం జగన్ అంగీకరించారు. విశాఖపట్నం, తిరుపతిలో కొత్తగా ఫొరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లో 176 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ సీఎంకు తెలిపారు. పోస్టుల భర్తీ కోసం జనవరి 1 నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ అన్నారు.
దిశ యాప్
వేధింపులకు గురవుతున్న మహిళలు కాల్ చేయాల్సిన కాల్‌సెంటర్, యాప్, వెబ్‌సైట్లపై సీఎం జగన్ సమీక్షించారు. సురక్ష స్పందన యాప్ తయారు చేశామని డీజీపీ తెలిపారు. మొత్తం 86 రకాల సేవలు అందుతాయని, త్వరలోనే ప్రారంభిస్తామని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. 100, 112 నంబర్లను ఇంటిగ్రేడ్ చేయాలన్నారు. దీంతో పాటుగా దిశ యాప్‌ను కూడా పెట్టాలని సీఎం జగన్ అన్నారు. దీనికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు. దిశ చట్టం అమలు కోసం పోలీస్ విభాగంలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించే ఆలోచన చేయాలని సీఎం జగన్ అన్నారు. దిశ చట్టం అమలుకు వ్యవస్థలన్నీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, స్టాండర్ట్ ఆపరేషన్ ప్రోసీజర్ తయారు చేయాలన్నారు. వీలైనంత త్వరలో మొత్తం ఈ కార్యక్రమాలను పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించారు.
జిల్లాల్లో ఉన్న మహిళా పోలీస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడానికి అధికారులు సీఎం జగన్‌కు ప్రతిపాదనలు వినిపించారు. దిశ చట్టం అమలుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం సృష్టం చేశారు. రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్‌స్టేషన్లలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలు, నలుగురు సపోర్టు సిబ్బందిని ఏర్పాటు చేయాలంటూ డీజీపీ ప్రతిపాదించారు. కాగా సీఎం జగన్ వెంటనే అంగీకారం తెలిపారు. 13 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియమాకాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని సీఎం జగన్ అన్నారు. ప్రతి జిల్లాలో ఉన్న ఒన్‌స్టాప్ సెంటర్లను మరింత బలోపేతం చేయాలన్నారు.