బీజేపీ ఎత్తులకు కాంగ్రెస్‌ నిలవలేదా?.. కాంగ్రెస్‌ పెద్దల నిర్లక్ష్యంతోనే 'ఎంపీ' చేజారిందా..?

By Newsmeter.Network  Published on  25 March 2020 9:51 AM GMT
బీజేపీ ఎత్తులకు కాంగ్రెస్‌ నిలవలేదా?.. కాంగ్రెస్‌ పెద్దల నిర్లక్ష్యంతోనే ఎంపీ చేజారిందా..?

బీజేపీ వ్యూహాలకు కాంగ్రెస్‌ కుదేలవుతూనే వస్తుంది. ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ వస్తున్న కాంగ్రెస్‌.. తాజాగా మధ్య ప్రదేశ్‌లోనూ ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గ విబేధాలను తమకు అనుకూలంగా మార్చుకోవటంలో బీజేపీ సఫలీకృతమైంది. ఫలితంగా కమల్‌నాథ్‌ తనంతట తానే సీఎం కుర్చీని వదిలేలా చేసి.. బీజేపీ దర్జాగా అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దల నిర్లక్ష్యం కూడా ఉందా.. అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సరిగ్గా 15 నెలల క్రితం బొటాబొటీ మెజార్టీతో మధ్యప్రదేశ్‌ సీఎంగా కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా ఉన్న సింధియా సీఎం పదవికి పోటీ పడినప్పటికీ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కమల్‌నాథ్‌కే పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచి సింధియా, కమల్‌నాథ్‌ల మధ్య వర్గవిబేధాలు సాగుతున్నాయి. ఈ వర్గ విబేధాలు కొద్ది నెలల్లోనే తీవ్ర రూపం దాల్చాయి. ఇదే అదునుగా చూస్తూ వచ్చిన బీజేపీ సరియైన సమయంలో కాంగ్రెస్‌లో వర్గవిబేధాలను సద్వినియోగం చేసుకుంది.

Also Read :దేశంలో 11కు చేరిన కరోనా మృతుల సంఖ్య

మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నేతగా ఉన్న సింధియాను బీజేపీలోకి ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన వెంట 16 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వీరిలో ఆరుగురు మంత్రులు ఉన్నారు. సింధియాను, పార్టీని వీడిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి మళ్లి తీసుకొచ్చేందుకు కేంద్ర పార్టీ పెద్దలుసైతం రంగంలోకి దిగినా సద్వినియోగం లేకపోయింది. దీంతో సింధియా బీజేపీలోకి వెళ్లడం, ఆయన వెంట 22మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రావడం చకచకా జరిగిపోయాయి. జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా, ఆయన వెంట వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ బలం పూర్తితగ్గిపోయింది.

Also Read : ఇప్పట్లో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు లేనట్లే? గవర్నర్‌ ఆర్డినెన్స్‌ ద్వారా ఆమోదం తీసుకుంటారా?

దీంతో అసెంబ్లిలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ కలిసి బీజేపీ పెద్దలు విన్నవించారు. గవర్నర్‌ బలపరీక్షకు ఆదేశించారు. కానీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కావటంతో గవర్నర్‌ ప్రసంగం అనంతరం స్పీకర్‌ ప్రజాప్రతి సభను వాయిదా వేశారు. మళ్లి బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బలపరీక్షను వెంటనే నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. బలపరీక్షకు ముందే ఎలాగూ తమకు బలంలేదని భావించిన కమల్‌నాథ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మధ్యప్రదేశ్‌ కూడా బీజేపీ ఖాతాలో చేరింది.

Also Read :లాక్‌డౌన్‌తో.. వీళ్లకు పస్తులే!

మధ్యప్రదేశ్‌లో అధికారం కోల్పోవటానికి కాంగ్రెస్‌ అధిష్టానం నిర్లక్ష్యం కూడా కారణంగా భావిస్తున్నారు. పార్టీలో వర్గవిబేధాలు బహిర్గమైనప్పటికీ నేతలకు సర్ధిచెప్పి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించేలా చేయడంలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు విఫలమయ్యారనే వాదనలు ఉన్నాయి. దీనికితోడు కేంద్రంలో కాంగ్రెస్‌కు సరియైన నాయకుడు లేకపోవటం, ఇదే సమయంలో బీజేపీ నాయకత్వం బలంగా ఉండటంతో రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. మొత్తానికి మధ్యప్రదేశ్‌ నేర్పిన గుణపాఠంతోనైనా కాంగ్రెస్‌ అదినాయకత్వం పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Next Story