ఇప్పట్లో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు లేనట్లే? గవర్నర్‌ ఆర్డినెన్స్‌ ద్వారా ఆమోదం తీసుకుంటారా?

By Newsmeter.Network  Published on  25 March 2020 8:07 AM GMT
ఇప్పట్లో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు లేనట్లే? గవర్నర్‌ ఆర్డినెన్స్‌ ద్వారా ఆమోదం తీసుకుంటారా?

కరోనా వైరస్‌ మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇటు ఏపీలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఏపీలో ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో కరోనా అనుమానితులను ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించడంతో ఏపీలోనూ ప్రజలందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. ఎవరు బయటకు వచ్చినా పోలీసులు తిరిగి ఇండ్లకు పంపిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వైకాపా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ ప్రభావం ఏపీ అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలపైనా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరిలో అసెంబ్లి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. మార్చి 31 నాటికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ని ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నెల 31లోగా రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించకపోతే ఏప్రిల్‌ ఒకటి నుంచి.. రాష్ట్రం ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అధిగమించాలంటే మార్చి 31లోగా రాష్ట్ర శాసన సభ, మండలిలో రాష్ట్ర వార్షిక ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read : కర్ణాటక ఎంపీ కుమార్తెకు కరోనా పాజిటివ్‌

దీంతో ఈనెల 28న బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించేందు ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం, తరువాత ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన 2020 - 2021ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అసెంబ్లి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేలా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో ఏపీలో అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలు ఇప్పట్లో లేనట్లేనని సమాచారం. అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల వాయిదాకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమావేశాలు నిర్వహించాలా.. లేదా..? ఒక వేళ సమావేశాలు నిర్వహించి కేవలం బడ్జెట్‌ ప్రవేశపెట్టి వాయిదా వేసేలా సమావేశాలు నిర్వహించాలా అనేదానిపై గత రెండు రోజులుగా ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది.

Also Read : లాక్‌డౌన్‌తో.. వీళ్లకు పస్తులే!

మంగళవారం రాత్రి ప్రధాని దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలు చేయడంతో ఇప్పుడు సమావేశాలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోనచలు చేస్తున్నట్లు సమాచారం. గవర్నర్‌ ఆర్డినెన్స్‌ ద్వారా.. ఒకటి లేదా రెండు నెలలకు కావాల్సిన బడ్జెట్‌ను ఆమోదం తీసుకునే యోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఏపీ అధికారులు ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Next Story
Share it