కర్ణాటక ఎంపీ కుమార్తెకు కరోనా పాజిటివ్‌

భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే భారత్‌లో 550కుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 11మంది మృతిచెందారు. సోమవారంతో పోల్చితే మంగళవారం కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య కొంత తగ్గింది. సోమవారం 94 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మంగళవారం 64 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కర్ణాటకలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 10 పాజిటివ్‌ కేసులు నమోదవయ్యాయి. కర్నాటక కు చెందిన ఎంపీ కుమార్తెకు కరోనా పాజిటివ్‌ తేలింది. మార్చి 22న గయానా నుంచి బెంగళూరుకు వచ్చిన ఆమె చిత్రదుర్గ జిల్లాలోని తన నివాసంలో క్వారంటైన్‌లో ఉంది.

Also Read :స్పెయిన్‌లో దారుణం.. సైన్యం కంటపడిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

ఆమెకు వైరస్‌ లక్షణాలు బయటపడటంతో మంగళవారం దావణగరె హాస్పిటల్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మరోవైపు ఆ రాష్ట్రంలో అత్యధికంగా మంగళూరులోనే నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరంతా కేరళకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. బెంగళూరులో మూడు, చిక్కబళ్లాపురలో ఒక కేసు, ఉత్తర కన్నడ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ణాటకలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తం 43కు చేరింది. కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించడంతో పాటు, ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచిస్తుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *