ఈ భూమికి మానవుడు చేసిన హాని అంతా ఇంతా కాదు. పర్యావరణం మొత్తం నాశనమైపోయింది. మానవుడి స్వార్థానికి ఎన్నో జీవరాశులు అంతమైపోయాయి. ఇక గాలి విషతుల్యమైపోయింది. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో నష్టాలు భూమికి కలిగేలా చేసింది మానవజాతి.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలడంతో లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నాయి. ఎన్నో దేశాలలో కంపెనీలు, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.. నగరాలు నిర్మానుష్యమయ్యాయి. ప్రజల రాక పోకలు కూడా చాలా తక్కువ అయిపోయాయి. దీంతో అడవుల్లో ఉన్న జంతువులు కూడా జనావాసాల్లోకి వస్తున్నాయి. కొద్ది రోజుల నుండి తిరుమల వీధుల్లో జింకలు, ఎలుగు బంట్లు, చిరుతల సంచారం ఎక్కువైన సంగతి తెలిసిందే. కేరళలో కూడా ఎన్నో ఏనుగులు అడవుల్లో నుండి బయటకు వస్తూ ఉన్నాయి.

చాలా అరుదుగా జరిగే ఘటనలే ఇవన్నీ.. మనుషుల కదలిక ఎక్కువగా లేకపోవడంతో వన్య ప్రాణులు కూడా స్వేచ్ఛగా తిరగాలని అనుకుంటూ ఉన్నాయి. పలు నగరాలలోకి కూడా వన్య ప్రాణులు ప్రవేశించాయని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “Poor terrified #Leopard which strayed into a town in #jallandhar, Punjab,#India. #SocialDistancing forgotten in this chaos #COVID19 #coronavirus” అంటూ వీడియోను పోస్ట్ చేశారు.

పాపం చిరుతపులికి ఎటు పోవాలో తెలీయక పంజాబ్ రాష్టంలోని జలంధర్ నగరంలోకి ప్రవేశించింది అంటూ ఈ వీడియోలో ఉంది. ఆ వీడియోలో చుట్టూ మేడలపైన జనాలు ఉండగా వారి అరుపులకు చిరుత అటూ, ఇటూ తిరగడం మొదలుపెట్టింది. ఒక ఇంట్లో నుండి మరొక ఇంట్లోకి వెళ్లడమే కాకుండా.. పట్టుకోవాలని ప్రయత్నించిన వాళ్లకు దొరకకుండా ఆ చిరుత పులి తప్పించుకుంటున్న వీడియో అది. దీన్ని పలువురు తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తూ వచ్చారు.

నిజమెంత:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం అబద్ధం.

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియోకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తూ పలు ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు వార్తలను ప్రచారం చేశాయి. ఈ వీడియో లోని ఘటన చోటుచేసుకుని దాదాపు సంవత్సరం పైనే అవుతోంది.

రిపోర్ట్స్ ప్రకారం ఈ ఘటన చోటు చేసుకున్న తేదీ జనవరి 31, 2019. జలంధర్ లోకి ప్రవేశించిన చిరుత పులి స్థానికులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది. చాలా మందిని గాయ పరిచింది. 800000 పైగా జనాభా ఉన్న ఆ నగరంలో కొన్ని గంటల పాటూ భీతావహ వాతావరణాన్ని సృష్టించి. ఎంతో కష్టపడి ఆ చిరుతని పట్టుకున్నారు. ఇదే వీడియోను బిబిసిలో కూడా పోస్టు చేశారు.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టుల ప్రకారం ‘ఈ ఘటన జలంధర్ లోని లామా పిండ్ లో చోటుచేసుకుంది. ఓ చిరుత తప్పించుకుని వచ్చి జనాలను భయభ్రాంతులకు గురిచేసింది. దాదాపు ఆరు మంది చిరుత దాడిలో గాయపడ్డారు. 12 మందికి చెందిన బృందం.. దాదాపు 11 గంటల పాటూ కష్టపడి ఆ చిరుతను పట్టుకున్నారు. చండీఘర్ లోని ఛాత్బిర్ జూకు తరలించి.. దానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ ఘటన చోటుచేసుకుని పంజాబ్ రాష్ట్రం లోని జలంధర్ లోనే.. అది కూడా జనవరి 31, 2019 న చోటు చేసుకున్న ఘటన. ప్రస్తుతం లాక్ డౌన్ సమయం లో ఈ ఘటన చోటుచేసుకుంది అన్నది ‘పచ్చి అబద్ధం’

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *