ధోనీ గురించి ఎంతో పాజిటివ్‌గా చెప్పిన గంభీర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 7:14 AM GMT
ధోనీ గురించి ఎంతో పాజిటివ్‌గా చెప్పిన గంభీర్

శనివారం నాడు మహేంద్ర సింగ్ ధోని తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్టు చేసి తాను ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ధోని గొప్పతనంపై, అతడు భారత క్రికెట్ కు చేసిన సేవలపై పలువురు ప్రశంసించారు.

గౌతమ్ గంభీర్ ధోనిపై ప్రశంసల జల్లు కురిపించారు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన 'క్రికెట్ కనెక్టెడ్' షో ధోని ఓ రికార్డును మాత్రం ఎవరూ అందుకోలేరని చెప్పుకొచ్చారు. ఇంతకూ ఆ రికార్డు ఏమిటో తెలుసా..? మూడు ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకోవడం. ధోని కెప్టెన్సీ లో భారత్ టీ20 వరల్డ్ కప్ ను, వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్న సంగతి తెలిసిందే..! ఈ రికార్డును భవిష్యత్తులో ఏ భారత కెప్టెన్ కూడా అందుకోలేడని తాను పందెం కాయగలనని గంభీర్ చెప్పుకొచ్చారు.

" ఒక రికార్డు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే.. అది ఐసీసీ ట్రోఫీలు.. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఘనత ధోనీ పేరిటే నిలిచి వుంటుందని చెప్పగలను. ఈ విషయమై నేను పందెం కాయగలను. టీ-20 వరల్డ్ కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2011 వరల్డ్ కప్ లను ధోనీ నేతృత్వంలోనే గెలిచాము. మరే కెప్టెన్ కూ ఇది సాధ్యం కాదని నమ్ముతున్నాను. సెంచరీల రికార్డులు ఎవరైనా బద్దలు కొట్టవచ్చు.. భవిష్యత్తులో మరెవరైనా వచ్చి, డబుల్ సెంచరీల విషయంలో రోహిత్ శర్మ రికార్డును చేరుకోవచ్చు. భారత కెప్టెన్ గా ధోనీ సాధించిన రికార్డు మాత్రం అలాగే ఉండిపోతుంది" అని అన్నారు గంభీర్. ఎన్నో విషయాల్లో ధోనిని విమర్శించే గంభీర్.. ఈసారి మాత్రం ఎంతో పాజిటివ్ గా మాట్లాడారు.

ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చినా ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఇంకో రెండు మూడేళ్లు కొనసాగుతాడనే ఆశిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 19న ధోని ఈ ఏడాది ఐపీఎల్ లో రంగంలోకి దిగనున్నాడు.

Next Story