ధోనికి కరోనా టెస్టు.. రిజల్ట్ ఏమని వచ్చిందంటే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Aug 2020 12:34 PM GMTఐపీఎల్ అతి త్వరలో మొదలుకాబోతున్న తరుణంలో ఫ్రాంచైజీలు సమాయత్తమవుతూ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. జట్టు సహచరుడు మోనూ సింగ్ తో కలిసి రాంచీలో కరోనా టెస్టులకు శాంపిల్స్ ఇచ్చారు. నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి ఆయన శ్వాబ్ ను పరిశీలించి 'నెగటివ్' అని తేల్చింది.
ఐపీఎల్ గావర్కింగ్ కౌన్సిల్ ఆటగాళ్లందరికీ కరోనా టెస్టులు నిర్వహించాలని చెప్పడంతో ధోనీ కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో నెగటివ్ అని వచ్చింది. గత ఏడాది వరల్డ్ కప్ సెమీఫైనల్ ముగిసిన తర్వాత ధోనీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఈ ఏడాది ఐపీఎల్ మొదలైతే ధోని ఆటను చూడొచ్చు అని భావించిన అభిమానులు లాక్ డౌన్ కారణంగా చాలా సమయమే ఎదురుచూడాల్సి వచ్చింది. లాక్ డౌన్ సమయంలో ధోని రాంచీ లోని తన ఫామ్ హౌస్ లో గడుపుతూ వచ్చారు.
యూఏఈ వేదికగా ఐపీఎల్ తాజా సీజన్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది. ఈ నెల మూడో వారంలో చెన్నై జట్టు యూఏఈ వెళ్లనుంది.
ఐపీఎల్ కు వెళ్లే ముందు పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాయి. యుఎఈకి వెళ్లే ముందు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయనున్నారు. ఒక వేళ పాజిటివ్ అని తేలితే 14 రోజుల పాటూ క్వారెంటైన్ లో ఉంచనున్నారు. క్వారెంటైన్ సమయం ముగిశాక మరో రెండు టెస్టులు నిర్వహించనున్నారు. నెగటివ్ అని తేలితే ఆటగాళ్లను మైదానం లోకి వదలనున్నారు.
ఈ సీజన్ ప్రారంభం కాకముందే రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్‌కు కొవిడ్-19 సోకింది. దీంతో అతను 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. యూఏఈ వెళ్లే 24 గంటల ముందు రెండు సార్లు ఆర్‌సీటీ, పీసీఆర్ పరీక్షలు చేయించాలని బీసీసీఐ నిబంధనలు విధించింది. వచ్చేవారం రాజస్థాన్ రాయల్స్ సభ్యులంతా ముంబాయి శిబిరానికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అందరిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాయల్స్ సూచించింది. ఫ్రాంచైజీ సూచనలతో దిషాంత్ యగ్నిక్ కోవిడ్-19 పరీక్షలు చేసుకోగా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఆటగాళ్లందరకి అదనపు టెస్ట్‌లు చేసేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్దమైంది. రాయల్స్ ఆటగాళ్లతో పాటు ఇతర ఐపీఎల్ ప్లేయర్లు ఎవరూ దిశాంత్‌ను కలవలేదని రాజస్థాన్ యాజమాన్యం స్పష్టం చేసింది.