ఈ రోజు చొల్లంగి అమావాస్య. ఈ పవిత్ర దివాన తూర్పు గోదావరి జిల్లా చొల్లంగి వద్ద ఉన్న సాగర సంగమంలో (గోదావరి నది) స్నానం ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. నేడు నదీ స్నానాలు చేసి, పితృ తర్పణాలు వదిలితే వంశాభివృద్ధి, 21 తరాల పితృదేవతలకు నరక విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజే సప్త సాగర యాత్ర మొదలవుతుంది. స్వర్గలోక ప్రాప్తి సిద్ధించడానికి నేడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చొల్లంగి అమావాస్య నాడు పితృదేవతలకు మోక్షం ప్రసాదించడానికి నదీ స్నానం చేయాలి. పితృతర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 'నువ్వులు నింపిన రాగి పాత్రను, వస్త్రాలను, అన్నాన్ని పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి. మౌనవత్రం పాటిస్తూ శివారాధన చేయడం వల్ల సకల జాతక దోషాలు తొలగి పుణ్యగతులు లభిస్తాయి. రుద్రాభిషేకంతో మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహాల ప్రదక్షిణ మంచిది' అంటున్నారు.
చొల్లంగి అమావాస్య పర్వదినాన మనసును, శరీరాన్ని నిర్మలంగా ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య తిథి ముగిసే వరకు మద్యం, మాంసాహారాలకు దూరం ఉండాలని అంటున్నారు. 'ఇది పితృదేవతలు మన ఇంటికి వచ్చే సమయం కావున.. ఎవర్నీ దూషించకూడదు. ఇంట్లో గొడవలు పడకూడదు. శుభకార్యాల చర్చలు, కొత్త వస్తువుల కొనుగోలు చేయకపోవడం ఉత్తమం. గోర్లు, జుట్టు కత్తిరించొద్దు. దైవ చింతనలో గడపాలి' అని వారి సూచన.