మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌సెన్ జిల్లాలో ఉన్న సోమేశ్వరాలయాన్ని ఈ ఉదయం తెరిచారు. ఇందులో విచిత్రం ఏముంది..? ఆలయం అన్నాక ప్రతి రోజు తెరుస్తారు అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా ఆగండి. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే తెరుస్తారు. అది కూడా మహా శివరాత్రి రోజున మాత్రమే. మిగతా అన్ని రోజుల్లో ఆలయం మూసే ఉంటుంది. దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఈ శివాలయం ఉంటుంది. వెయ్యి అడుగుల ఎత్తైన కొండపై 10వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే.. కొంత కాలం తరువాత ఈ ఆలయం ముస్లిం రాజుల ఆధీనంలోకి వెళ్లింది. 1974లో ఈ ఆలయాన్ని తెరవాలంటూ భక్తులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఫలితంగా అప్పటి సీఎం ప్రకాష్ సేథీ సోమేశ్వరాలయం తాళం తీసి మహాశివరాత్రి రోజున మాత్రమే పూజలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.
ఇక అప్పటి నుంచి ఈ ఆలయాన్ని ఒక్కసారే అది కూడా మహాశివరాత్రి రోజునే తెరుస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆలయాన్ని తెరిచారు. 12 గంటల పాటు తెరిచే ఉంటుంది. సాయంత్రం మూసివేస్తారు. దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక భక్తులకు పంపిణీ చేసేందుకు 5 క్వింటాళ్ల కిచిడీ, పండ్లను సిద్దం చేశారు.