'మహా'సంగ్రామంలో మరో ట్విస్ట్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Nov 2019 1:03 PM ISTఒకపక్క మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంలో వాదనలు కొనసాగుతున్నాయి. మరోపక్క సీఎంగా ఫడ్నవీస్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ కూడా ఉన్నట్లు సమాచారం.
ఇదిలావుంటే.. మహారాష్ట్ర రాజకీయంపై ఉదయం నుండి సుప్రీంలో వాదనలు వాడివేడిగా జరుగుతున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల తరపు న్యాయవాది కపిల్ సిబల్ తమ వాదనలు కోర్టుకు వినిపించారు. ఉదయం 5గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తివేసే అంత అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు. అలాగే.. తమకు మద్దతుగా 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనీ.. దీనికి సంబందించి అఫిడవిట్లు సైతం ఉన్నాయంటూ కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఆ 154 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు పరిగణనలోకి తీసుకుని 24 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.
అయితే.. బలపరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీం కోర్టుకు బీజేపీ ఇప్పటికే సంకేతాలు పంపినట్టు సమాచారం. అందుకే సుప్రీంలో వాదనలు జరుగుతుండగానే ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ ఎంతో దీమాగా ఉందనే విషయం అవగతమవుతుంది.