ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూల్చివేత
By తోట వంశీ కుమార్ Published on 17 Sept 2020 9:17 AM ISTవరంగల్‌లో ఇటీవల వచ్చిన వరదలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు కరోనా భయం, మరో వైపు వరదల భయంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. భారీ వర్షాలకు పలు కాలనీలు వరద నీటిలో మునిగాయి. ఈ క్రమంలో రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. నాలాల విస్తరణ జరపాలని, వాటిపై చేపట్టిన నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. మంత్రి ఆదేశాలతో వరద నీటి కాల్వలను విస్తరించేందుకు వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షన ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
వరదలకు కారణం.. అక్రమ కట్టడాలేనన్నది బహిరంగ రహస్యమే. అయితే, అక్రమ కట్టడాల విషయంలో అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లు ఉండవని నేతలు సూచించటంతో వరంగల్ అధికారులు పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో నాలాపై నిర్మించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ క్యాంపు కార్యాలయంపై ఇటీవల వార్తలు వెల్లువెత్తాయి. స్పందించిన ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయ కూల్చివేతకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు బుధవారం పోలీసుల బందోబస్తు మధ్య డీఆర్‌ఎఫ్ టీం సభ్యులు కార్యాలయాన్ని కూల్చివేశారు