ప్రజాస్వామ్యంలో మనది పేరు గొప్ప.. ఊరు దిబ్బ

By అంజి  Published on  23 Jan 2020 7:32 AM GMT
ప్రజాస్వామ్యంలో మనది పేరు గొప్ప.. ఊరు దిబ్బ

మనం పేరుకే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ ప్రజాస్వామ్యాన్ని ఆచరించే విషయంలో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం. సుప్రసిద్ధ ఆంగ్ల పత్రిక ది ఎకనామిస్టు తాలూకు ఇంటలిజెన్స్ సర్వే జారీ చేసిన ప్రజాస్వామ్య సూచికలో మన దేశం గతేడాదితో పోలిస్తే పదిస్థానాలు పడిపోయింది. 2019 లో మన ర్యాంకింగ్ 51. ఈ సారి మనకు వచ్చిన పాయింట్లు 6.90. గతేడాది మన స్కోరు 7.23. ప్రజాస్వామ్యం విషయంలో భారత్ ది పేరు గొప్ప.. ఊరు దిబ్బ.

మొత్తం 165 దేశాలపై ఈ సర్వేని నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రభుత్వం పని విధానం, రాజకీయ పార్టీల వ్యవహార శైలి, రాజకీయ సంస్కృతి, పౌరహక్కుల ఆధారంగా మార్కులు ఇవ్వడం జరిగింది. ఎనిమిది లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్లు వస్తే ఉత్తమ ప్రజాస్వామ్యం. ఎనమిది నుంచి ఆరు పాయింట్ల మధ్యలో ఉంటే బలహీన ప్రజాస్వామ్యం, ఆరు నుంచి నాలుగు పాయింట్ల వరకూ ఉంటే హైబ్రిడ్ పాలన, నాలుగు కన్నా తక్కువగా ఉంటే నియంతృత్వంగా విభజించారు. మనకు ఆరు నుంచి ఎనిమిది పాయింట్ల మద్య వచ్చింది కాబట్టి మనం బలహీన ప్రజాస్వామ్యాల కేటగరీలో చేరాం. 2006 తరువాత మన దేశం ఇంత తక్కువ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. మన దేశానికి ఎన్నికల ప్రక్రియ, సామాజిక వైవిధ్యంలో 6.67 పాయింట్లు, ప్రభుత్వ పనితీరుకు 6.79 పాయింట్లు, రాజకీయ భాగస్వామ్యానికి 6.67 పాయింట్లు, రాజకీయ సంస్కృతికి 5.63 పాయింట్లు, పౌర హక్కులకు 6.76 పాయింట్ల లభించాయి.

అయితే చైనా 2.26 స్కోర్ (153వ ర్యాంకు), పాకిస్థాన్‌ 4.25 (108వ ర్యాంకు), శ్రీలంక 6.27(69వ స్థానం), బంగ్లాదేశ్‌ 5.88 (80వ స్థానం), రష్యా 3.11 స్కోర్‌ (134వ స్థానం) సాధించి చాలా వెనుకబడి ఉన్నాయి. ఇక అట్టడుగు స్థానం సాధించింది దక్షిణ కొరియా. తొలి పది స్థానాలు అంటే బలమైన ప్రజాస్వామ్యం కేటగరీలో నార్వే (1), ఐస్‌లాండ్‌ (2), స్వీడన్‌ (3), న్యూజిలాండ్‌ (4), ఫిన్‌లాండ్‌ (5), ఐర్లాండ్‌ (6), డెన్మార్క్‌ (7), కెనడా (8), ఆస్ట్రేలియా (9), స్విట్జర్లాండ్‌ (10) దేశాల ఖాతాలోకి వెళ్లాయి.

అయితే ప్రపంచవ్యాప్తంగానే ప్రజాస్వామ్యసూచిక లోని వివిధ అంశాల్లో వెనకడుగు కనిపించడం కాసింత ఆందోళనకరమైన విషయం. అన్ని సూచికల్లోనూ 2014 తో పోలిస్తే తగ్గుదల కనిపించింది.

Next Story