ఢిల్లీ: అక్టోబర్‌ 5 వరకు పాఠశాలలు మూసివేత

By సుభాష్  Published on  28 Sep 2020 10:41 AM GMT
ఢిల్లీ: అక్టోబర్‌ 5 వరకు పాఠశాలలు మూసివేత

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలు అక్టోబర్‌ 5వ తేదీ వరకు మూసివేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీఈవో జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేస్తారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుఉని ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 5 వరకు ఆన్‌లైన్‌ క్లాసులు, అభ్యాస కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. అనంతరం మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి విద్యార్థులు ఇండ్లకే పరిమితం అయ్యారు. కాగా, పిల్లలు విద్యను కోల్పోకుండా చూడడానికి ఆన్‌లైన్‌ ద్వారా విద్యను అందిస్తున్నారు. ముందుగా సెప్టెంబర్‌ 30లోపు రాజధానిలోని అన్ని పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించిన ఢిల్లీ సర్కార్‌.. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. కొన్ని షరతులతో సెప్టెంబర్‌ 21 నుంచి పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించవచ్చనే వార్తలు వినవస్తున్నాయి.

కాగా, ఢిల్లీలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు ఢిల్లీలో మొత్తం 2 లక్షల 34వేల 701 కేసులు నమోదయ్యాయి. ఇందులో లక్ష 98వేల 103 మంది రోగులు కోలుకున్నారు. ఇక రికవరీ రేటు 84.40 శాతం ఉండగా, మృతుల సంఖ్య 4,877కు చేరింది.

Next Story
Share it