ఢిల్లీ అల్లర్ల పేరిట.. ముస్లిం యువకులను ఐసిస్ రిక్రూట్ చేస్తోందా.?

By అంజి  Published on  2 March 2020 6:32 AM GMT
ఢిల్లీ అల్లర్ల పేరిట.. ముస్లిం యువకులను ఐసిస్ రిక్రూట్ చేస్తోందా.?

ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ముస్లిం యువతను ఆకర్షించేందుకు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? అవుననే అంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఆదివారం రాత్రి ఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన ఒవైసీ ఐసిస్ ఢిల్లీ అల్లర్లను ఉపయోగించుకుని రిక్రూట్ మెంట్ ను కొనసాగిస్తోందని అన్నారు. పోలీసులు చితకబాదుతున్న మహ్మద్ జుబైర్ అనే వ్యక్తి ఫోటోను ఉపయోగించి ఐసిస్ భారతీయ ముస్లింలను రిక్రూట్ చేస్తోందని ఆయన అన్నారు.

ఈ విషయంలో ప్రధానమంత్రి పెదవి విప్పాలని ఆయన అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రధానమంత్రి ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్ల విషయంలో ప్రధానమంత్రి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా తెలియచేయలేదని ఆయన అన్నారు. జుబైర్ పోటోను, ఐబీ అధికారి అంకుర్ శర్మ తల్లి రోదనను చూసిన వారెవరికైనా గుండె కరుగుతుందని ఆయన అన్నారు. జుబైర్ తో ప్రధాని మాట్లాడాలని, తాను, తన ప్రభుత్వం, యావత్తు దేశం జుబైర్ వెనుక ఉందన్న భరోసా కల్పించాలని ఆయన అన్నారు. ఈ అల్లర్లలో చనిపోయిన నలభై మందికి, గాయపడ్డ ఎనభై మందికి న్యాయం జరగాలని ఒవైసీ అన్నారు.

ఢిల్లీలో ఒక పథకం ప్రకారం అల్లర్లు జరిగాయని, గత రెండు దశాబ్దాలుగా దేశంలో జరిగిన అన్ని అల్లర్లకు ప్రధానమంత్రిదే బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిజమైన దోషులను పట్టుకోలేదని, నేరం బిజెపిదేనని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ అల్లర్ల బాధితులకు ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్యేలు, జీ హెచ్ ఎంసీ కార్పొరేటర్లు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు కూడా ఒవైసీ ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ నివాసుల రిజిస్టర్ ను అమలు చేయొద్దని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని అమోదించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Next Story