ఏపీకి మార్కాజ్ సెగ : 369 మంది హాజరు.. ఇద్దరు మృతి.. ట్విస్ట్ ఏంటంటే..
By సుభాష్ Published on 31 March 2020 4:21 AM GMTఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన టేబుల్‌ఘీ జమాత్ ఆలామి మార్కాజ్ మతపరమైన సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 369 మంది హాజరయినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ సమావేశానికి హాజరయిన వారిలో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు.
అయితే.. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. చనిపోయినవారి మృతదేహాల నుండి సేకరించిన నమూనాలలో వారికి కరోనా నెగిటివ్ అని తేలింది. అయితే.. రోగ నిర్ధారణ కోసం నమూనాలను మెరుగైన ప్రయోగశాలలకు పంపారు. ఇదిలావుంటే.. ఈ సమావేశాలలో పాల్గొనడానికి వీరంతా రైళ్ల ద్వారా డిల్లీ వెళ్లారని ఏపీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక.. ఇదే సమావేశానికి తెలంగాణ నుండి సుమారు 380 మంది హాజరవ్వగా.. వీరిలో కోవిడ్ -19 వైరస్ కారణంగా ఆరుగురు మృతిచెందారు.
కాగా.. ఏపీ నుండి ఈ సమావేశానికి హాజరయిన వారిలో దాదాపు 13 జిల్లాలకు చెందినవారు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది కర్నూలు, కడప, గుంటూరుకు చెందినవారుగ తెలుస్తుంది. ఇక ఈ జిల్లాల నుండి సమావేశానికి హాజరైన వారిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సమావేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ 369 మంది చాలా మందిని కలిశారని అనుమానిస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే వారిని గుర్తించే పనులు ముమ్మరం చేశారు.
ఇక ఈ విషయమై ఏపీకి చెందిన ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాక ఈ సమావేశం జరిగింది. పెద్ద ముప్పు పొంచి ఉన్న నేఫథ్యంలో ఇటువంటి సమావేశం వాయిదా వేసి ఉండాల్సింది. విదేశాలనుండి కూడా ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరవడం కలవరపరిచే విషయమని అన్నారు.