ఢిల్లీలో మరోసారి చీపురు ఊడ్చిపారేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కౌంటింగ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ దూసుకుపోయింది.  కమలం పార్టీని వెనక్కినెట్టి విజయఢంకా మోగించింది. కాగా, పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఎగ్జిట్‌పోల్‌ అంచనాలను నిజం చేస్తూ భారీ విజయం తన ఖాతాలో వేసుకుంది ఆప్‌. ఈ తీర్పుతో అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా మూడోసారిగా ప్రయాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ప్రజలు సరికొత్త తీర్పునిచ్చారని, తమపై నమ్మకముంచి మరోసారి పాలన పగ్గాలు కట్టబెట్టినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఢిల్లీ ప్రజలకు అందించిన మంచి పాలననే మరోసారి గెలుపునకు బాటలు వేశాయన్నారు. సామాన్యుడి కోసం ప్రవేశపెట్టిన పథకాలు, విద్యుత్‌, వైద్యం కోసం చేసిన కృషికి ప్రజలు మరోసారి గెలించారన్నారు. మరో ఐదేళ్ల పాటు ప్రజల కోసం కష్టపడనున్నట్లు చెప్పారు. ఈ తీర్పులో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 63 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ 7 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ మాత్రం ఘోర పరాజయం చవి చూసింది. ఒక్కసీటు కూడా దక్కకుండా బోల్తాపడింది. 2015 ఎన్నికలతో పోల్చి చూస్తే ఫలితాల్లో పెద్దగా తేడా కనిపించలేదు.

కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన మోదీ

ఢిల్లీలో మరోసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపొందినందుకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారరు. మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ను అభినందిస్తూ ట్విట్‌ చేశారు మోదీ. ఢిల్లీ అభివృద్ధిపై తన వంతు సహాయసహకరాలుంటాయని పేర్కొన్నారు.

బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏమన్నాడంటే..

ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీని అభివృద్ధి చేస్తుందనే నమ్మకంతో అమ్‌ఆద్మీకి మరోసారి అవకాశం ఇచ్చారని, ఇక నుంచి ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తూ, అసెంబ్లీలో సమస్యలను లేవనెత్తుతుందన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు అభినందనలు తెలుపుతూ నడ్డా ట్విట్‌ చేశారు.

కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ

ఢిల్లీలో మరోసారి విజయం సాధించినందుకు ఆమ్‌ఆద్మీ పార్టీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎదురులేని మనిషిగా మరోసారి విజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేజ్రీవాల్‌ అండ్‌ టీంకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు అభినందనలు తెలుపుతూ ట్విట్‌ చేశారు.

ఢిల్లీలో మరోసారి విజయఢంకా మోగించిన ఆప్‌, పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌కు హృదయ పూర్వక అభినందనలు అంటూ సీఎంలు జగన్‌ ట్విట్, కేసీఆర్‌ ట్విట్‌ చేశారు. అలాగే యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, జమ్మూకశ్మీర్‌ సీఎం పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కేజ్రీవాల్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ అభినందనలు

ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ ఢిల్లీ ఫలితాలపై స్పందించారు. ఆమ్‌ఆద్మీ పార్టీని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు అంటూ ట్విట్‌ చేశారు. అలాగే మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్న అరవింద్‌ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.