మోదీ, అమిత్ షా, మంత్రులు, 200మంది ఎంపీలు.. వారంద‌రికి అత‌నొక్క‌డే..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 7 Feb 2020 4:16 PM IST

మోదీ, అమిత్ షా, మంత్రులు, 200మంది ఎంపీలు.. వారంద‌రికి అత‌నొక్క‌డే..!

రేపు ఉద‌యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. ఆప్ అధినేత‌, డిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై శివసేన ప్రశంసలు కురిపించింది. ఓట్ల కోసం బీజేపీ మతపరమైన విభజనకు తెర‌లేపే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. వారిని కేజ్రీవాల్‌ దీటుగా ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

కొద్దిరోజుల క్రితం జ‌రిగిన‌ మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలలో ఓట‌మి చెంద‌డంతో.. ఢిల్లీలో ఎలాగైనా గెలవాల‌ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా విశ్వ‌ ప్రయత్నాలు చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల‌ సీఎంలు, 200 మంది బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, సీనియర్‌ నేతలు ప్రచారంలోకి దిగి జోరుగా ప్ర‌చారం చేస్తుండ‌గా.. వారందరినీ కేజ్రీవాల్‌ ఒక్కడే ఎదుర్కొంటున్నారని శివ‌సేన‌ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.

Image result for Delhi Election Campaign

కేజ్రీవాల్‌.. గత ఐదేళ్లలో తన ప్రభుత్వం చేపట్టిన పనుల ఆధారంగా ఢిల్లీ ఓటర్లను ఓట్లు కోరుతున్నారని.. దీనిని పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలని కోరింది. ఇక క‌మ‌ల‌నాథులు ఎండిన చెరువులో వికసించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని ఎద్దేవా చేసింది. ఎవరిని ఎన్నుకోవాలో ఢిల్లీ ప్రజల‌కు తెలుసని.. వారు తెలివైన‌వార‌ని వ్యాఖ్యానించింది. ఇక‌ కేంద్ర సర్కార్‌.. ఆప్‌ ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టిస్తోందని దుయ్యబట్టింది.

బీజేపీ స‌ర్కార్ నుండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. కేజ్రీవాల్‌ ప్రభుత్వం విద్యా, వైద్యం, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మంచి పురోగతి సాధించిందని సామ్నా పేర్కొంది. కేజ్రీవాల్‌.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప‌ట్ల‌ అభినందించాల్సిన కేంద్రం.. అత‌నికి అవరోధాలు సృష్టిస్తోందని విమ‌ర్శ‌లు చేసింది.

Image result for Delhi Election Campaign

ఇక కేజ్రీవాల్‌ను బీజేపీ నాయ‌కులు ఉగ్రవాదిగా పేర్కొన‌డాన్ని శివ‌సేన తప్పుపట్టింది. కేజ్రీవాల్‌ ఉగ్రవాదే అయితే.. బీజేపీ స‌ర్కార్‌ అత‌నిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని.. గ‌త ఎన్నిక‌ల‌లో ఢిల్లీ ఓటర్లు 70 శాతం మంది ఉగ్రవాదికి అనుకూలంగా ఓటు వేశారని బీజేపీ అనుకుంటుందా..? అని శివ‌సేన సామ్నా సంపాద‌కీయంలో ప్రశ్నించింది.

Next Story