ఢిల్లీ అల్లర్లు: కీలక ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
By సుభాష్ Published on 26 Feb 2020 4:09 PM IST
ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పోలీసులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. విచారణకు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావాలని ఆదేశించింది. ఈ అల్లర్లపై విచారణ జరిపిన కోర్టు.. దేశ రాజధానిలో 1984 నాటి అల్లర్లు పునరావృతం కావద్దని హెచ్చరించింది. పూర్తి స్థాయిలో పౌరులకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా, అల్లర్ల ప్రభావిత ప్రాంతాలను ఢిల్లీ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రులు సందర్శించాలని కోర్టు సూచించింది. అల్లర్ల నేపథ్యంలో ప్రతి ఒక్కరికి జడ్ సెక్యూరిటీలా రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. బాధితులు, వారి కుటుంబాలను పరామర్శించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కాగా, ఈ అల్లర్ల కారణంగా ఐబీ అధికారి మృతి చెందడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అల్లర్లలో అధికారి మృతి చెందడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది.
కాగా, ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతుండటంతో బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు భయపడే వారికి షెల్టర్ ఇవ్వాలని కోర్టు తెలిపింది. అంతేకాకుండా వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. అలాగే అల్లర్ల నేపథ్యంలో మృతి చెందిన వారి అంత్యక్రియలు సజావుగా సాగేలా చూడాలని తెలిపింది. క్షతగాత్రుల వద్దకు అంబులెన్స్ వాహనం త్వరగా చేరేలా పోలీసులు చర్యలు చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.