ఢిల్లీ క్యాపిటల్స్‘సూపర్’ విజయం
By తోట వంశీ కుమార్ Published on 21 Sep 2020 3:34 AM GMTక్రికెట్ అభిమానులకు అసలు సిసలు మజా అందించిన మ్యాచ్. క్షణ క్షణానికి సమీకరణాలు మారిన వైనం. ఓ సారి ఢిల్లీ క్యాపిటల్స్, మరో సారి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య విజయం దోబూచులాడింది. టోర్నీలో తొలి మ్యాచ్‌లో బోణి కొట్టాలని ఇరు జట్లు చివరికంటా పోరాడాయి. ఆశలు లేని స్థితి నుంచి అద్భుతంగా పుంజుకున్నాయి. ఉత్కంఠభరిత మలుపులతో అభిమానులను ఉర్రూతలుగించిన మ్యాచ్‌లో ఫలితం తేలడానికి సూపర్ ఓవర్ అనివార్యమైంది. అక్కడా ఊహించనిదే జరిగింది. చివరికి విజయం ఢిల్లీని వరించింది.
టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డిండ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఢిల్లీ ఇంత స్కోర్ చేస్తుందని బహుశా ఆజట్టు కూడా అనికోని ఉండదు. ఎందుకంటే.. ఆ జట్టు ఆరంభం అంత పేవలంగా ఆరంభమైంది. మహమ్మద్ షమీ దాటికి (3/15) దాటికి ఢిల్లీ 4 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 13 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ ధావన్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌటైపోగా.. పృథ్వీ షా(5), హెట్‌మైయర్(7) లను షమి ఔట్ చేశాడు. ఈ దశలో రిషబ్‌పంత్ (31) కలిసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(39) జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు బ్యాటింగ్‌తో ఢిల్లీ కుదురుకున్నట్లే కనిపించింది. అయితే.. పంజాబ్ బౌలర్లు పుంజుకుని ఓవర్ వ్యవధిలో ఈ ఇద్దరిని పెవిలియన్ చేర్చారు. ఆ తరువాత వేగంగా వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లకు ఢిల్లీ 113/6తో నిలిచింది. అయితే చివరి రెండు ఓవర్లలో ఆల్‌రౌండర్ స్టాయినిస్ (53; 21బంతుల్లో 7పోర్లు, 3సిక్సర్లు) అనూహ్యంగా చెలరేగిపోయాడు. 19 ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన అతను 20 ఓవర్లలో చెలరేగి రెండు సిక్సర్లు, మూడు పోర్లు బాదాడు. 20బంతుల్లో అర్థశతకం సాధించాడు.
158 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(21; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. మోహిత్ శర్మ వేసిన ఐదో ఓవర్ మూడో బంతికి రాహుల్ బౌల్డ్ అయ్యాడు. కరుణ్ నాయర్, పూరన్‌లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. ఆపై మ్యాక్స్‌వెల్(1) కూడా ఔటయ్యాడు. 10 ఓవర్లలో కింగ్స్ పంజాబ్ సగం వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. ఒకవైపు ఓపెనర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్(89;60బంతుల్లో 7పోర్లు, 4 సిక్సర్లు) క్రీజ్‌లో ఉండగానే వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లు పెవిలియన్ చేరడంతో కింగ్స్ పంజాబ్ ఒత్తిడిలోకి వెళ్లింది. ఆ సమయంలో మయాంక్ క్రీజ్‌లో పాతుకుపోయాడు. చివరి 2 ఓవర్లలో 25 పరుగులు కావాలి. రబాడా వేసిన ఓవర్ రెండు పోర్లు సహా 12 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. 3 బంతుల్లో 12 పరుగులు వచ్చాయి. దీంతో పంజాబ్ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ చివరి 3 బంతుల్లో పరగే రాకపోవడం రెండు వికెట్లు పడడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. రబాడ వేసిన మొదటి బంతికి రెండు పరుగులు రాబట్టింది. రెండో బంతికి కేఎల్ రాహుల్, మూడో బంతికి పూరన్ ఔట్ కావడంతో పంజాబ్ చాప్టర్ క్లోజ్ అయ్యింది. 3 పరుగుల టార్గెన్ ను ఢిల్లీ సునాయాసంగా ఛేదించి సూపర్ విక్టరీ అందుకుంది.