వచ్చే ఏడాది కూడా యూఏఈలోనే ఐపీఎల్..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sep 2020 1:49 PM GMT
వచ్చే ఏడాది కూడా యూఏఈలోనే ఐపీఎల్..!

భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుండడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజన్‌ను యూఏఈకి బీసీసీఐ తరలించిన సంగతి తెలిసిందే. అయితే.. వచ్చే సీజన్‌(ఐపీఎల్ 2021)‌ను కూడా అక్కడే నిర్వహించాలని బీసీసీఐ చూస్తోందని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబధాలు మెరుగుపరుచుకోవడం, పరస్పర సహకారంతో టోర్నీల నిర్వహణలో భాగంగా బీసీసీఐ, యూఏఈ క్రికెట్‌ బోర్డు మధ్య ఒక ప్రత్యేక ఎంఓయూ కుదిరింది. దీని ప్రకారం వచ్చే నెలల్లో భారత్‌లో కరోనా ఉధృతి తగ్గకపోతే.. టీమిండియా సొంతగడ్డపై ఆడాల్సిన సిరీస్‌లకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అవుతుంది. యూఏఈతో ఒప్పందాల గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్లో వెల్లడించారు.

వచ్చే ఏడాది చివరల్లో ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు రావాల్సి ఉంది. ఈ సిరీస్‌ను కూడా యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. ప్రతి ఏటా షెడ్యూల్‌లాగే ఏప్రిల్‌-మేలోనే ఐపీఎల్‌ జరగాల్సి వస్తే యూఏఈనే సరైన వేదికగా భావిస్తున్నట్లు చెప్పిన బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు... ఇంగ్లండ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా ప్రత్యామ్నాయంగా ఎడారి దేశాన్ని చూసినట్లు చెప్పారు. 2000 సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత భారత జట్టు యూఏఈలో ఆడేందుకు (2006లో పాక్‌తో 2 వన్డేల సిరీస్‌ మినహా) నిరాకరిస్తూ వచ్చింది. అయితే 2014లో కొన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించిన తర్వాత బీసీసీఐ మెత్తబడింది.

Next Story