కరోనా మహమ్మారికి బలైన ఢిల్లీ ఆల్ రౌండర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jun 2020 2:26 PM IST
కరోనా మహమ్మారికి బలైన ఢిల్లీ ఆల్ రౌండర్

కరోనా మహమ్మారికి ఎంతో మంది బలైపోతున్నారు. పలువురు క్రికెటర్లకు కూడా కరోనా మహమ్మారి సోకింది. పాకిస్థాన్ జట్టులో ఏకంగా 10 మందికి కరోనా సోకిందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..! ఎప్పుడు ఎవరికీ ఏమవుతుందో అన్న భయం అందరినీ వెంటాడుతోంది. ఢిల్లీ ఆల్ రౌండర్ 'సంజయ్ దోబల్' కరోనా కారణంగా మరణించారు. కరోనా వైరస్ లక్షణాలు ఎక్కువవడంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సంజయ్ వయసు 52 సంవత్సరాలు.

సంజయ్ దోబల్ ఎంతో మంచి వ్యక్తి అని పలువురు ఆటగాళ్లు ఆయన గురించి కొనియాడారు. అతడికి తెలిసిన ఎవరైనా ఆటగాళ్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే సంజయ్ దోబల్ సహాయం చేసేవాడట.

సంజయ్ లోకల్ లెవల్ లో మంచి క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టీనేజ్ లో ఉన్నప్పుడు సంజయ్ లో అద్భుతమైన ప్రతిభ ఉండడం తాము గమనించామని ప్రముఖ కోచ్ తారక్ సిన్హా తెలిపారు. హార్డ్ హిట్టర్ గా మిడిల్ ఆర్డర్ లో వచ్చే వాడని, ఆఫ్ స్పిన్ కూడా బాగా వేసి మ్యాచ్ లను గెలిపించేవాడని తారక్ సిన్హా తెలిపారు.

ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ మిథిన్ మన్హాస్ కూడా దోబల్ తో తన ఫ్రెండ్ షిప్ ను గుర్తు చేసుకున్నాడు. దోబల్ క్రికెటర్ గా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ ఎయిర్ ఇండియా కోచ్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి అకాడెమీలో క్రికెట్ స్కిల్స్ కంటే ఫిట్నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టించేవాడని మిథిన్ మన్హాస్ గుర్తు చేసుకున్నాడు. దోబల్ కు కరోనా సోకిందని తెలియగానే ఆయనకు ప్లాస్మా ట్రీట్మెంట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ప్లాస్మా ట్రీట్మెంట్ ఇవ్వగా.. సోమవారం ఉదయం దోబల్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

దోబల్ కు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సిద్ధార్థ్ రాజస్థాన్ రంజీ జట్టు తరపున ఆడుతూ ఉన్నాడు. రెండవ కుమారుడు ఏకాన్ష్ అండర్-23 ప్లేయర్ గా ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు.

Next Story