పిల్ల‌ల‌కు ఆ హ‌క్కు ఉంది.. దళితేతర మహిళ కులాన్ని మార్చ‌లేం : సుప్రీం

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన ప్రత్యేక హక్కును ఉపయోగించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువ‌రించింది.

By Kalasani Durgapraveen  Published on  6 Dec 2024 1:28 PM IST
పిల్ల‌ల‌కు ఆ హ‌క్కు ఉంది.. దళితేతర మహిళ కులాన్ని మార్చ‌లేం : సుప్రీం

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన ప్రత్యేక హక్కును ఉపయోగించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువ‌రించింది. దళితేతర మహిళ, దళిత పురుషుడి వివాహాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. గత ఆరేళ్లుగా తల్లితో కలిసి ఉంటున్న తన మైనర్ పిల్లలకు షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాల‌ని భర్తను కోర్టు ఆదేశించింది.

జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం.. జూహీ పోరియా, ప్రదీప్ పోరియాలకు విడాకులు మంజూరు చేస్తూ.. దళితేతర మహిళ.. వివాహం ద్వారా షెడ్యూల్డ్ కుల సంఘంలో సభ్యత్వం పొందలేరని.. అయితే షెడ్యూల్డ్ కులానికి పుట్టిన ఆమె కుమారుడు మాత్రం షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాలు పొందవచ్చని పేర్కొంది. పిల్లలు SC ట్యాగ్‌కు అర్హులు అని వెల్ల‌డించింది.షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని (కమ్యూనిటీకి) వివాహం చేసుకోవడం ద్వారా కులాన్ని మార్చలేమని 2018లో ఒక నిర్ణయాన్ని కూడా ఉద‌హ‌రించింది.

11 ఏళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె గత ఆరేళ్లుగా రాయ్‌పూర్‌లోని వారి తల్లితండ్రుల ఇంట్లో దళితేతర మహిళ అయిన త‌ల్లితో నివసిస్తున్నారు. దీంతో పాటు పిల్లలిద్దరికీ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగాల కోసం పిల్లలను షెడ్యూల్డ్ కులాలుగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.

జస్టిస్ కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. సంబంధిత అధికారులను సంప్రదించి ఆరు నెలల్లోపు పిల్లలిద్దరికీ ఎస్సీ సర్టిఫికెట్లు పొందాలని భర్తను కోరింది. అడ్మిషన్, ట్యూషన్ ఫీజుతో పాటు బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులతో సహా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అతని చదువుకు అయ్యే మొత్తం ఖర్చును భరించాల‌ని కోర్టు తెలిపింది. వ‌న్ టైం సెటిల్‌మెంట్ కింద భార్య‌, పిల్లల జీవితకాల పోషణ కోసం భ‌ర్త‌ ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఆ మహిళ తన భర్త నుంచి ఏకంగా రూ.42 లక్షలు పొందనుంది.

ఇది కాకుండా.. రాయ్‌పూర్‌లోని తన భూమిని కూడా భర్త ఆ మహిళకు ఇవ్వ‌నున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. విడిపోయిన జంట మధ్య ఒప్పందంలోని నిబంధనను కూడా బెంచ్ అమలులోకి తెచ్చింది, దీని ప్రకారం.. వచ్చే ఏడాది ఆగస్టు 31 నాటికి భర్త వ్యక్తిగత ఉపయోగం కోసం మహిళకు ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి ఇవ్వాలి.

ఒకరిపై ఒకరు దాఖలు చేసిన క్రాస్ ఎఫ్‌ఐఆర్‌లను కూడా ధర్మాసనం కొట్టివేసింది. పిల్లలను వారి తండ్రికి ఎప్పటికప్పుడు ద‌గ్గ‌ర‌గా ఉంచాలని.. సెలవుల్లో తీసుకెళ్లాలని.. వారి మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని సుప్రీంకోర్టు మహిళను ఆదేశించింది.

Next Story