రక్షణశాఖ కార్యదర్శికి కరోనా
By సుభాష్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇక భారత రక్షణశాఖలోకరోనా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో వెంటనే ఆయనను క్వారంటైన్ చేసిన అధికారులు.. కార్యాలయాన్ని శానిటైజేషన్ చేయించారు.
ఆయన పని చేస్తున్న రైసినాహిల్స్ లోని సౌత్‌బ్లాక్ లోని మిగతా 35 మంది ఉద్యోగులను కూడా హోంక్వారంటైన్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం కార్యాలయానికి హాజరు కాలేదు. గత కొన్ని రోజులుగా అజయ్ కుమార్ రక్షణ శాఖ అధికారులు ఎవరెవరిని కలిశారన్నదానిపై ఆరా తీస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి, కార్యదర్శి, ఆర్మీ చీఫ్, నేవి చీఫ్ కార్యాలయాలు సౌత్ బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. దీంతో కార్యాలయాన్ని మొత్తం శానిటైజ్‌చేసి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఉద్యోగులు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక భారత్‌లో గడిచిన 24 గంటల్లో 9304 కేసులు నమోదు కాగా.. 260 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు దేశంలో 2,16,919 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,075 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,04,107 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,06,737 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.