ట్రక్కులో 64 మృతదేహాలు.. ఎక్కడంటే
By సుభాష్ Published on 27 March 2020 6:02 AM GMTదేశం దాటిస్తానని చెప్పి కూలీల ప్రాణాలు తీసాడు ఓ ట్రక్ డ్రైవర్. మొజాంబిక్‌లోని టేటే రాష్ట్రంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద ట్రక్కులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 64 మృత దేహాలు బయటపడ్డాయి. వాటి మధ్య 14 మంది సజీవంగా ఉండటం మరింత కలకలం రేపింది. దిక్కుతోచని స్థితిలో కనబడి వారిని చూసి అధికారులు సైతం షాక్ తిన్నారు. పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు రాష్ట్ర సరిహద్దుల్లో మలావీ నుంచి వస్తున్న ఈ వాహనాన్నిఆపి తనిఖీ చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. మృతులను జింబాబ్వే నుంచి వచ్చిన ఇథియోపియన్లుగా భావిస్తున్నారు. వాహనంలో వారిని పరిమితికి మించి కుక్కడంతో శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. పోలీసులు కంటెయినర్ డ్రైవర్‌ను, అతని అసిస్టెంట్‌ను అరెస్ట్ చేశారు. కొనఊపిరితో ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించారు.
మొజాంబిక్ దేశంలోకి ఇథియోపియన్ల అక్రమ ఎంట్రీకి ఎవరు వీలు కల్పించారన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఈ వాహనంలో అనేకమంది ఇథియోపియన్లు ప్రయాణిస్తున్నట్టు దక్షిణాఫ్రికా లోని ఇథియోపియన్ ఎంబసీ ద్వారా తమకు సమాచారం అందిందని అడ్డిస్ అబాబాలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్ లో ఉన్న వ్యక్తుల వద్ద ఎలాంటి id కార్డులు లేవని తెలిపింది. ట్రక్ డ్రైవర్ వీరి దేశం దాటించడానికి ఒక్కొక్కరి దగ్గరనుంచి 30000 మెటికల్స్ అంటే మనం కరెన్సీలో సుమారు 37 వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఉపాధికోసం పొట్ట చేతబట్టుకుని అనేకమంది ఇథియోపియన్లు దొంగచాటుగా మొజాంబిక్ దేశంలోకి ప్రవేశిస్తుంటారు. ఇదే అదనని దళారులు వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని.. వీరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజి అక్రమ మార్గాల ద్వారా తరలిస్తుంటారు.