కరోనా కాటు: ఆర్బీఐ సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  27 March 2020 5:35 AM GMT
కరోనా కాటు: ఆర్బీఐ సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (ఆర్బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెపో రేటును 75 బేసిక్‌ పాయింట్ల మేరకు కోత విధించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలను వివరించారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ఆర్థిక సుస్థిరత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అయితే కరోనా ఎఫెక్ట్‌, లాక్‌డౌన్‌ లాంటివి ఉన్న పరస్థితుల కారణంగా మీడియాతో మాట్లాడాల్సి వచ్చిందని, ఏప్రిల్‌ మాసంలో ప్రకటించాల్సిన విధాన నిర్ణయాన్ని ముందుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్చి 24, 26, 27 తేదీలలో సమావేశమై మానిటరీ పాలసీ కమిటీ స్థూల ఆర్థిక, సూక్ష్మీ ఆర్థిక పరిస్థితులపై చర్చ జరిగినట్లు ఆయన వివరించారు. దీని ప్రకారమే రెపో రేటు పాయింట్ల కోత విధించినట్లు చెప్పారు. ప్రస్తుతం రెఎపో రేటు 4.40 శాతానికి దిగిరాగా, 90 బీపీఎఎస్‌ పాయింట్ల కోతతో రివర్స్‌ రెపోరేటు 4 శాతం ఉండనుంది.

అంతేకాకుండా మరో వైపు రుణాల చెల్లింపుల విషయంలో కూడా ఆర్బీఐ తీపి కబురు అందించింది. బ్యాంకులతో పాటు అన్ని ఫైనాన్స్‌ సంస్థలు అన్ని రకాల రుణాలపై ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ఆర్బీఐ గవర్నర్‌ సూచించారు. రుణ చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు సహకరిస్తామని, ఆర్‌బీఐలో 150 మంది ఉద్యోగులను సైతం క్వారంటైన్‌లో ఉన్నారన్నారు.

Next Story
Share it