అల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో స‌త్తా చాటిన ఢిల్లీ.. ఆర్సీబీ ఘోర ప‌రాజ‌యం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Oct 2020 2:30 AM GMT
అల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో స‌త్తా చాటిన ఢిల్లీ.. ఆర్సీబీ ఘోర ప‌రాజ‌యం

ఐపీఎల్‌-2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ దూసుకెళుతోంది. అల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. మొద‌ట‌ బ్యాటింగ్‌లో, తర్వాత బౌలింగ్‌లో చెలరేరి 59 పరుగుల తేడాతో బెంగళూరును కంగుతినిపించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది.

ఆల్‌రౌండ‌ర్ స్టొయినిస్‌ (26 బంతుల్లో 53 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించగా.. పృథ్వీషా (23 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (25 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన హైదరాబాద్‌ బౌలర్‌ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఓడింది.

కెప్టెన్‌ కోహ్లి (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తప్ప ఎవరూ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్‌ నోర్జేకు రెండు వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్‌ చేసిన స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

ఇదిలావుంటే.. టి20 క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఏడో క్రికెటర్‌గా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గుర్తింపు పొందాడు. తన 271వ టి20 మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు.

ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ (13,296 పరుగులు–396 మ్యాచ్‌లు), పొలార్డ్‌ (10,345–461 మ్యాచ్‌లు), షోయబ్‌ మాలిక్‌ (9,926–365 మ్యాచ్‌లు), బ్రెండన్‌ మెకల్లమ్‌ (9,922–364 మ్యాచ్‌లు), వార్నర్‌ (9,391–285 మ్యాచ్‌లు), ఫించ్‌ (9,140 పరుగులు–285 మ్యాచ్‌లు) వరుసగా తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు.

Next Story