కుర్రాళ్లపై వార్నర్ ప్రశంసల జల్లు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Oct 2020 8:48 AM GMTదుబాయ్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లు కూడా పూర్తి కాకముందే.. ఆ జట్టును ముందుండి నడిపించే ఆటగాళ్లు బెయిర్ స్టో(0), వార్నర్(28), విలియమ్సన్(9), మనీశ్‌పాండే(29) పెవిలియన్ చేరారు. 14 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 81 పరుగులు మాత్రమే. అసలు హైదరాబాద్ కనీసం 130 పరుగులు అయినా చేస్తుందా అన్న సందేహాలు అభిమానుల్లో కలిగాయి.
అయితే.. ఆ అనుమానాలను పటాపంచులు చేస్తూ.. యువ ఆటగాళ్లు ప్రియమ్‌గార్గ్ (51; 26 బంతుల్లో 6 పోర్లు, 1 సిక్సర్), అభిషేక్ వర్మ(31; 24 బంతుల్లో 4 పోర్లు, 1 సిక్స్) సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లతో రాణించగా.. ఠాకూర్, చావ్లా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ(47; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా(50; 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా ఫలితం లేకపోయింది.
ఆఖరి బంతి వరకు ధోనీ క్రీజులో ఉండటం.. భువనేశ్వర్ గాయంతో ఓవర్ పూర్తి చేయకుండానే మైదానం వీడటంతో సన్‌రైజర్స్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. కానీ ఆఖరి ఓవర్ అందుకున్న అబ్ధుల్ సమద్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో హైదరాబాద్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సన్‌రైజర్స్ జట్టు యువ ఆటగాళ్లపై ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విజయం యువ ఆటగాళ్లదే. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని ఆడారన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కుర్రాళ్లు బాగా ఆకట్టుకున్నారన్నాడు. "గాయం కారణంగా భువనేశ్వర్ మైదానం వీడినప్పుడు మాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అందుకే 19వ ఓవర్‌లో ఐదు బంతులు ఖలీల్‌కు ఇచ్చాం.
20వ ఓవర్ తొలుత అభిషేక్‌కు ఇవ్వాలని అనుకున్నాం. కానీ సమద్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని అతనికే ఆ బాధ్యతలు అప్పగించాం. సమద్ తన ఎత్తును బాగా స్వదినియోగం చేసుకున్నాడు. తెలివిగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ కుర్రాళ్లు బాగా ఆడారు. వాళ్ల ప్రదర్శన పట్ల నేను గర్వంగా ఉన్నాను. మిగిలిన యువఆటగాళ్లందరికీ ఈ మ్యాచ్ మంచి సందేశం" అని వార్నర్ చెప్పాడు. ఇదే స్పూర్తిని తర్వాతి మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.