పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 11:21 AM GMT
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే.?

ఢిల్లీ: భారత పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు నవంబర్‌ 18 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉభయ సభల కార్యదర్శులకు తెలియజేసింది. గతవారం కేంద్రరక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ పార్లమెంటు శీతకాల సమావేశాలపై నిర్ణయం తీసుకుంది. కాగా ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి. పార్లమెంటు సమావేశాలు నవంబర్‌ 18న ప్రారంభమై డిసెంబరు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆటోమొబైల్‌ రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఆధిగమించేలా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణ కార్యక్రమాలను చేపట్టింది. బీజేపీ ప్రభుత్వం చేసిన ఆర్ధిక విధానాల వల్లే దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి. పార్లమెంట్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, అసోంలో ఎన్‌ఆర్‌సీ జాబితాపై చర్చించే అవకాశం ఉంది. గత సంవత్సరం శీతకాల సమావేశాలు డిసెంబర్‌ 11న ప్రారంభమై.. జనవరి మొదటి వారంలో ముగిశాయి. ఈ సారి దాదాపు నెల రోజుల ముందే శీతకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. మరో వైపు రాజ్యసభలో క్రమంగా బీజేపీ సంఖ్యా బలం పెరుగుతోంది. ప్రస్తుతం ఏన్డీఏ కూటమి బలం 106కు చేరుకుంది. శీతకాల సమావేశాలు ప్రారంభం నాటికి రాజ్యసభలో బీజేపీకి మరింత బలం పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

Next Story