తెలంగాణలో దసరా వరకు స్కూళ్లు తెరిచే ప్రసక్తే లేదు.!
By సుభాష్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కాలరాస్తుండటంతో అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా ఐదు దశల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. కరోనా ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇక దేశంలో కరోనా ఉద్ధృతం అవుతున్న సమయంలో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఇక కఠినంగా అమలు చేసిన లాక్‌డౌన్‌ను మెల్లమెల్లగా కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. ఇక లాక్‌డౌన్5.0లో మాత్రం భారీగానే సడలింపులు ఇచ్చింది కేంద్రం. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా కేంద్ర మార్గదర్శకాలను సైతం అమలు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఇక పాఠశాలలు ఎప్పుడెప్పుడు తెరుస్తారోనని తల్లిదండ్రుల్లో ఉత్కంఠనెలకొంది.
తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆగస్టు వరకూ పాఠశాలలు, కళాశాలలు తెరుస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయమై టీఎస్ ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్పందించారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలు ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పారు. దసరా వరకు తెరిచే ప్రసక్తే లేదని తెలిపిన ఆయన.. మూడు నెలల పాటు రాష్ట్రంలో పరిస్థితులు గమనించిన తర్వాత పాఠశాలలు తెరిచే విషయంపై ఆలోచిస్తామన్నారు. అలాగే పాఠశాలల్లో శానిటైజేషన్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడం వంటికి చాలా కష్టతరమైనవని చెప్పుకొచ్చారు.