అక్కా.. కరోనా నీకో లెక్కా.! ఆస్సత్రి నుంచి వచ్చిన అక్కకు డాన్స్ తో చెల్లి స్వాగతం
By మధుసూదనరావు రామదుర్గం Published on 21 July 2020 11:05 AM GMTకరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన ఆ యువతి విజయవంతంగా చికిత్స పూర్తిచేసుకుని స్వస్థతతో ఇంటికి తిరిగి వచ్చింది. ఈ సందర్భాన్ని రెచ్చిపోయి సంబరంగా మలచుకుంది ఆమె చెల్లి. అక్క ఇంటి వద్దకు రాగానే పాట పెట్టి రెచ్చిపోయి మరీ డాన్స్ చేసేసింది. మెరుపు తీగకన్నా వేగంగా స్టెప్స్ వేస్తూ అదరగొట్టేసింది. ఆదివారం నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి తుక్కు రేపుతోంది. అక్కాచెల్లెళ్ల మధ్య గాఢానుబంధానికి ఈ వీడియో నిలువెత్తు నిదర్శనం. కరోనా వస్తుందేమోనని.. వచ్చిందని దిగులుతో నీరసపడే జనాలకు ఈ వీడియో మాంఛి విటమిన్ టాబ్లెట్ లాంటిది. ఎంత కష్టమొచ్చినా తట్టుకుని పరీక్షలో నిలిచి గెలవాలని అక్క అంటుంటే.. అలాంటి అపురూప విజయాలను సంబరాలతో సొంతం చేసుకోవాలని చెల్లి చెబుతోంది.
ఈ ఆసక్తికర వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ దిపాన్సు కాబ్రా ట్వటిర్లో షేర్ చేశాడు. అనుబంధం అంటే ఇలా ఉండాలి. ఆ చిన్నారి చెల్లి డాన్స్ .. ఆ ఎనర్జీ ఎంతో ముచ్చటగా ఉందంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ ట్వీట్ ను వీక్షించిన వేలాది మంది ఈ సెంటిమెంట్ దృశ్యం చూశాక ఆనందించారు. భారతీయ సంస్కృతి బంధాలకు అనుబంధాలకు ఎలాంటి పునాదులు వేస్తుందో తలచుకుని పొంగిపోయారు. కేవలం రెండంటే రెండే నిమిషాల నిడివి ఉన్న వీడియో క్లిప్ చాలా ఆసక్తిగా సాగింది. ఇంటి బైట ఆవరణంలో చెల్లి తన అక్క ఆగమనం కోసం వళ్లంతా కళ్లు చేసుకుని నిరీక్షిస్తోంది. అక్క ఇంటికి కాసింత దూరంలో రోడ్డు దిగి ఇంటికి మెల్లిగా నడచుకుంటూ వస్తుండటాన్ని చూసింది.
ఒక్కసారిగా ఆమె గుండెలో ఆనందోద్వేగం కెరటంలా ఎగసింది. ఇక ఆగలేక పోయింది. అప్పటికేసిద్ధం చేసుకున్న చిల్లర్ పార్టీ సినిమాలో రికార్డు బద్దలు కొట్టిన మ్యూజికల్ హిట్ సాంగ్.. తాయ్ తాయ్ ఫిష్ ను ప్లే చేసింది. అంతటితో ఆగితే మజా ఏముంది? పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ అక్కకూ డాన్స్ వెల్ కమ్ చెప్పింది. పాటలో తన్మయత్వం చెంది చెల్లి రెచ్చిపోయి డాన్స్ చేస్తుంటే అక్కమాత్రం ఊరుకుంటుందా ఏంటి? తనూ చెల్లితోపాటు డాన్స్ షురూ చేసింది. అక్కా చెల్లెళ్ళ ఈ డాన్స్ అత్యద్భుతంగా సాగింది. ఈ వీడియో మీరు చూస్తే మీ పెదాలపై చిరునవ్వులు పూయడం ఖాయం.
అక్కాచెల్లెళ్ల జంట నృత్యానికి ఫిదా అయ్యాను. జస్ట్ ఐ లవ్డ్ సిస్టర్స్ డ్యుయెట్ అంటూ కాబ్రా కామెంట్ పెట్టి మరీ షేర్ చేశాడు. కరోనే కాదు ఎలాంటి ఉపద్రవం ముంచెత్తినా ఈ అక్కాచెల్లెళ్ల పెదాలపై చిరునవ్వు చెరిగిపోదు. ఏ కుటుంబం అయినా ఇలాంటి ఉత్సాహ కెరటాల్లాంటి సభ్యులుంటే చాలు ఆనందంతో మెరిసిపోతుంది. అని మరో వ్యాఖ్య జోడించాడు. ఆదివారం ఈ వీడియోను పోస్ట్ చేస్తే ఇప్పటి దాకా 20వేల పైచిలుకు మంది చూశారు. వందలాది రీట్వీట్ లు కామెంట్ల వరద పారింది. ఇద్దరిలో ఆ హుషారు.. ఆ చైతన్యం ముచ్చటగా ఉంది అని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు అద్భుత ప్రతిస్పందన అని కామెంటారు.