దళిత యువకుడికి శిరోముండనం.. ఏడుగురిపై కేసు నమోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2020 10:09 AM GMT
దళిత యువకుడికి శిరోముండనం.. ఏడుగురిపై కేసు నమోదు

విశాఖలోని పెందుర్తిలో దళిత యువకుడు శిరోముండనం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో ఏడుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ-1గా సినీ నిర్మాత నూతన్‌నాయుడు భార్య మధుప్రియ, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాలపై కేసు నమోదు చేశామని సీపీ మనీష్‌కుమార్ సిన్హా చెప్పారు. వీరంతా నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేస్తున్నట్లు గుర్తించామని, ఐఫోన్ చోరీ నెపంతో దళిత యువకుడిని హింసించి శిరోముండనం చేశారని, ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు దొరికాయని సీపీ వెల్లడించారు. సీసీ ఫుటేజీని సేకరిస్తున్నామని, నిందితుల విచారణ కోసం కస్టడీ కోరుతామని మనీష్‌ కుమార్‌ సిన్హా చెప్పారు.

అసలేం జరిగిందంటే..?

బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కర్రి శ్రీకాంత్(20) అనే యువకుడు ఉపాధి నిమిత్తం విశాఖకు వచ్చి సుజాతనగర్‌లో నివాసం ఉంటున్నాడు. బిగ్‌ బాస్‌ ఫేమ్‌, సినీ నిర్మాత, దర్శకుడు నూతన్‌ నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలుగా పనిచేస్తున్నాడు. ఈ నెల ఒకటో తారీఖు నుంచి అక్కడ పని మానేశాడు. ఇంట్లో ఫోన్‌ కనపడడం లేదని.. ఆ విషయం గురించి మాట్లాడాలని శ్రీకాంత్‌ను గురువారం రాత్రి నూతన్‌నాయుడు భార్య ఇంటికి రప్పించారు. తాను ఫోన్‌ తీయలేదని.. కావాలంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి శ్రీకాంత్‌ వెళ్లి పోయాడు.

శుక్రవారం మధ్యాహ్నం మరోసారి శ్రీకాంత్‌ను ఇంటికి పిలిపించారు. ఇంటికి వచ్చిన యువకుడికి స్థానిక బార్చర్‌ను పిలిపించి శిరోముండనం చేయించారు. అంతేకాకుండా రాడ్‌తో దాడి చేసి గాయపరిచారు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గాయంతో బాధపడుతున్న శ్రీకాంత్‌ తన చిత్రాలను సోషల్ మీడియాలో అప్‌ చేశాడు. తరువాత బాధితుడు వివిధ దళిత సంఘాల ప్రతినిధులతో కలిసి పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వాస్తవాలను ధృవీకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Next Story