పువ్వు తెంపినందుకు.. వెలి..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 26 Aug 2020 9:44 AM GMTతరాలు మారినా తలరాతలు మారలేదు.. అంతరాలు అంతకన్నా మారలేదు అనడానికి ఈ ఒక్క సంఘటన చాలు! కేవలం ఒక దళిత అమ్మాయి అగ్రవర్ణాలకు చెందిన వారి తోటలో సూర్యకాంతి పువ్వు తెంపిందని ఏకంగా ఆ గ్రామంలోని 40 దళిత కుటుంబాల్ని వెలి వేసేశారు. స్వాతంత్రం వచ్చి ఏడు పదులు దాటినా దేశంలో చాలామంది ఇంకా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోలేక పోవడం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఇటీవల ఒడిశాలోని దేంకనల్ జిల్లా ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
దేంకనల్ జిల్లాలోని కాన్షియో కాటేని గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి అగ్రవర్ణానికి చెందిన ఒకరి తోటలో పొరపాటున పువ్వు తెంపింది. రెండు నెలల కిందట ఈ ఘటన జరిగింది. ఆగ్రహంతో రగలిపోయిన అగ్రవర్ణాల వారు దాదాపు 40 దళిత కుటుంబాలకు సామాజిక బహిష్కరణ విధించారు. ఈ ఘటన జరిగిన వెంటనే అమ్మాయి తల్లిదండ్రులు ఊరి పంచాయతీ పెద్దల వద్దకెళ్ళి తప్పయిందని అర్థించారు. అయితే వారు ఏ విధంగానూ స్పందించలేదు.
ఈ ఘటన జరిగిన దరిమిలా ఆ బహిష్కృత 40 కుటుంబాల దళితుల్ని ఊరిలో జరిగే ఏ ఉత్సవాల్లోనూ పూజల్లోనూ పాల్గొననివ్వడం లేదు. ఊరి వారెవరు వారితో మాట్టాడ్డానికి వల్లేదని కట్టడి చేశారు. చివరికి వారికి సర్కరు రేషన్ కూడా దక్కకుండా చేశారు. దళిత వర్గానికి చెందిన టీచర్లు అక్కడ్నుంచి బదిలీ చేసుకునే వాతావరణం సృష్టించారు. ఆ తర్వాత వివాదం సద్దుమణగడంతో దళితులు బతుకు జీవుడా అనుకున్నారు.
అమ్మాయి తెలిసీ తెలియని వయసులో ఓ చిన్న పువ్వు తెంచుకున్నందుకు ఇంత రాద్ధాంతం చేశారు. ఇదంతా మా తలరాత అని ఆ ఊరి దళితులు వాపోయారు. కేవలం బహిష్కరించడమే కాదు మాపై పోలీసు స్టేషన్లో కేసు బనాయించారు. పోలీసుల ఈ పంచాయతీ తేల్చేద్దామని ఊరి పెద్దలను దళితులను సమావేశ పరచి శాంతి చర్చలు చేసి వారిని రాజీపరిచారు.
కానీ స్టేషన్ దాటాక అగ్రవర్ణాల వారు తమ పట్టు సడలించలేదని ఆవేదనగా తెలిపారు.. కొద్ది రోజులు తర్వాత దళితులు తమ దుస్థితిని వివరిస్తూ మళ్ళీ పోలీసులతో విన్నవించారు. ఈసారి అధికారుల సమక్షంలో రాజీ చేశారని దళితులు వివరించారు. అగ్రవర్ణానికి చెందిన హార్మన్ మొహాలిక్ మాట్లాడుతూ...ఇది చాలా చిన్న సమస్య. పోలీసులు ఇరు వర్గాల వారినీ పిలిపించి రాజీ కుదిర్చారు. ఇది దాదాపు రెండు నెలల కిందట జరిగింది. ఇప్పుడంతా సద్దుమణిగింది. మునపటికి ఎలా కలిసి ఉన్నామో.. ఇప్పుడు ఆలాగే ఉంటున్నాం’ అన్నాడు.
ఒక ఒడిశాలోనే కాదు కర్ణాటకలోని విజయపురలోనూ ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ దళిత యువకుడు అగ్రవర్ణానికి చెందిన వారి మోటర్‌బైక్‌ను తాకాడన్న నెపంతో కొందరు యువకుల గుంపు చేరి ఆ యువకుడి బట్టలు విప్పి దాడి చేసి అవమానానికి గురిచేశారు. మోటార్‌బైక్‌ను పొరపాటున తాకానని చెప్పినా వినిపించుకోకుండా వారు తనపై దారుణంగా దాడి చేసినట్లు కాశీనాథ్ వివరించాడు. బాధితుడు కాశీనాథ్ తండ్రి ఎంకప్ప మాట్లాడుతూ తమ కుమారుడిపై దాడిని నివారించేందుకు ప్రయత్నించిన తను, తన భార్య కూతుళ్లపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు.
కాశీనాథ్ ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఆ యువకుల గుంపులోని 13 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు విజయపుర జిల్లా ఎస్పీ అనుపమ్ అగర్వాల్ వివరించారు. ఇదిలా ఉండగా ఊరిలోని ఇద్దరు మహిళలు కాశీనాథ్ తమను అల్లరి చేస్తూ వేధించాడని ఫిర్యాదు చేశారు. ఈ విషయంగా కాశీనాథ్‌కు సమన్లు జారీ చేసినట్లు ఎస్పీ అగర్వాల్ తెలిపారు.
తలెత్తిన వివాదం సద్దుమణగడం మంచిదే. కానీ ఒకే సమాజంలో బతుకుతున్న వారందరికి సమాన హక్కులు, బాధ్యతలుండాలి కదా! నిమ్న వర్గాలన్న ఆగ్రహంతో కక్షసాధింపునకు పూనుకోవడం ఎంతవరకు సబబు అని ఈ రెండు ఘటనలు ప్రశ్నిస్తున్నాయి! పరిస్థితుల్లో మార్పు రావాలి. మనుషులందరూ ఒకటే అన్న భావన అందరిలోనూ చివురించాలి. అలా కాని నాడు ఇలాంటి ఘటనలు మరి కొన్ని తలెత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు.