రాజధానిలో నకిలీ కాల్ సెంటర్‌పై పోలీసుల దాడులు.. 17 మంది అరెస్టు
By సుభాష్ Published on 7 Nov 2020 2:27 PM GMTదేశ రాజధాని ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేపట్టారు. నకిలీ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తు 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. యూఎస్‌ఏ, కెనడాలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని నిందితులు దీనిని నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో ఉన్న కాల్ సెంటర్‌కు సహిల్ దిల్వారీ అనే వ్యక్తి మూడు సంవత్సరాలుగా యజమానిగా ఉంటున్నాడు. ఆయా దేశాల్లోని ప్రజలకు పాప్‌అప్ మెసేజ్‌లు పంపి వాళ్ల వ్యక్తిగత సమాచారాన్ని హ్యక్ చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను వైరస్‌కు గురయ్యేలా చేస్తారు.
అనంతరం మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ సాయంతో అందజేస్తామని ఈ ముఠా వాళ్ల నుంచి డబ్బులు దండుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఈ సెంటర్‌పై దాడి చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు 20 కంప్యూటర్లను సీజ్ చేశారు. వాటిల్లో లభించిన సమాచారం మేరకు ఈ ముఠా నకిలీ కాల్ సెంటర్ ద్వారా గత సంవత్సరం యూఎస్, కెనడాలోని 2268 మందిని మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్ల నుంచి రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు గుర్తించామని సైబర్ క్రైమ్ డీఎస్పీ తెలిపారు.