ఎంఎస్‌ ధోనీ..క్రికెట్ అభిమానుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం.. ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక బీసీసీఐ కూడా ధోనీని సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి తప్పించింది. దాదాపు 8నెలలు తర్వాత బ్యాట్ ప‌ట్టిన ధోనీ.. ఐపీఎల్‌ 13వ సీజన్‌ ద్వారా మైదానంలోకి అడుగుపెట్ట‌నున్నాడు.

ఈ నేఫ‌థ్యంలో.. ధోనీ ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ వీడియోనూ తమిళ స్టార్‌స్పోర్ట్స్‌ చానెల్‌ తమ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో ధోనీ వరుసగా 5 బంతులను ఐదు సిక్సులుగా మలిచిన‌ట్లుగా ఉంది. వివ‌రాళ్లోకెళితే.. మ‌రో మూడు వారాల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేఫ‌థ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది.

కాగా.. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ.. చిదంబరం స్టేడియంలో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. మహీ నెట్స్‌లోనే నిలబడి వరుసగా 5 బంతులను సిక్స్‌లుగా మలిచి స్టాండ్స్‌లోకి పంపాడు. అయితే ఆ బంతులు.. బౌలర్‌ వేశాడా లేక బౌలింగ్‌ మెషిన్‌ నుంచి వచ్చిన బంతులను సిక్స్‌లుగా కొట్టాడా అనేది మాత్రం తెలియ‌డం లేదు. ఈ వీడియో ఇప్పుడు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. 38 ఏళ్ల ధోనీ.. త‌న‌ ఐపీఎల్‌ కెరీర్‌లో 190 మ్యాచులాడి 4432 పరుగులు చేయ‌గా.. అందులో 23 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.