ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ కు నిజంగా శుభవార్త ఇది. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. గాయంతో జాతీయ జట్టుకు దూర‌మైన పాండ్యా.. రీఎంట్రీ సిద్దంగా ఉన్నానంటూ బ్యాటుతో మరో సారి సిగ్నల్ పంపాడు. గాయం నుంచి కోలుకున్న ఈ ఆటగాడు ఇప్పుడు బంతికే జ్వరం వచ్చేలా బాదుడుతన్నాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్‌ టీ20 కప్‌లో ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్స్‌ వారం రోజుల వ్యవధిలో రెండో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

హార్దిక్‌ పాండ్యా.. డీవై పాటిల్‌ టీ20లో టోర్నిలో రిలయన్స్ 1 జ‌ట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బీపీసీఎల్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో రిలయన్స్‌-1 బ్యాటింగ్‌కు దిగింది. జట్టు స్కోర్‌ 10 పరుగులకు చేరుకునే సరికి రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అడుగులో అడుగు పెట్టాడు హర్ధిక్‌ పాండ్యా.

పూనకం వచ్చినట్లు బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 39 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది ఈ టోర్నీలో హార్దిక్‌ రెండో సెంచరీ. ఆ తరువాత కూడా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 20 సిక్సర్లు, 6 పోర్లు బాది.. 55 బంతుల్లోనే 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో రిలయన్స్‌ 1 జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.

ఈ క్రమంలోనే టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును హార్దిక్‌ నమోదు చేశాడు. అంతకుముందు టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్‌ రికార్డు శ్రేయస్‌ అయ్యర్‌ పేరిట ఉండేది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో అయ్యర్‌ 147 పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకూ అత్యుత్తమం, కాగా దానిని హార్దిక్‌ బ్రేక్‌ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన బీపీసీఎల్‌ 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది హార్దిక్‌ జట్టు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.