మరో 24గంటలు తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులకు సెలవులు రద్దు
By తోట వంశీ కుమార్ Published on 26 Sep 2020 6:33 AM GMTతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి మొదలైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాల్లోనే ఉంటూ పరిస్థితులు తెలుసుకొని.. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అల్పపీడనం బలహీనపడినా.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతొందని.. ఇక రానున్న 24 గంటలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలశయాలను తలపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీలోని పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేసింది. దీంతో లోతట్టు ప్రాంతంలో అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్ లో వర్షపు నీరు నిలవడంతో.. ప్రమాదవశాత్తు ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.