బంజారాహిల్స్‌: మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వహణలో ఉన్న వారిపై దురుసుగా ప్రవర్తించింనందుకు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్ ముట్టడికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్‌ 48 దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌ ఏసీపీ కే.ఎస్‌.రావు, జూబ్లీహిల్స్‌ ఇన్ స్పెక్టర్‌ కె.బాలకృష్ణారెడ్డి, సెక్టార్‌ ఎస్‌ఐ నవీన్ రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన బయటకు రాకుండా కట్టడి చేశారు.

అయితే ..మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి అతివేగంగా ఇంట్లో నుంచి బయటకు దూసుకొ చ్చారు. ఆ సమయంలో అడ్డుకున్న ఎస్‌ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను నెట్టుకుంటూ, పక్కకు తోసేస్తూ అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై దూసుకుపోయారు. పోలీసులు అప్రమత్తమై చాలాదూరం ఛేజ్‌ చేసుకుంటూ వెళ్లినా అప్పటికే రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ ఘటనలో నవీన్ రెడ్డికి గాయాలయ్యాయి. మిగతా పోలీసులను కూడా నెట్టుకుంటూ వెళ్లడంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఐ నవీన్ రెడ్డి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేయగా.. ఆయనపై ఐపీసీ సెక్షన్ 341, 332తో పాటు 353 కింద నాన్ బెయిలబుల్‌ సెక్షన్ ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏసీపీ నంద్యాల నరసింహ రెడ్డిపై వేటు..!

ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహ రెడ్డిపై వేటు వేశారు. ప్రగతి భవన్ ముందు ఇంచార్జిగా నంద్యాల నరసింహ రెడ్డి ఉన్నారు. ప్రగతి భవన్ వరకు కాంగ్రెస్ నేతలు చొచ్చుకు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. నంద్యాల నరసింహ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కు ఎటాచ్ చేశారు.

రేవంత్ రెడ్డిపై ఫిర్యాదుకు కాంగ్రెస్ సీనియర్లు రెడీ..!

మరోవైపు... రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్లు కొంతమంది రహస్య సమావేశం కూడా నిర్వహించారు. రేవంత్‌పై వీహెచ్, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సోమవారం తరువాత రేవంత్ రెడ్డిపై ఫిర్యాదుకు నేతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌కు పీసీసీ ఇస్తే..ఎవర్నీ లెక్క చేయడని కొంత మంది సీనియర్లు అన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story